రాజ్యసభ ఎన్నికల వేడి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. వచ్చే నెల 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 26 రాజ్యసభ(24+2) స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఏపీ నుంచి ఖాళీ కాబోతున్న నాలుగు సీట్లు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
ముఖ్యంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే అన్నామలైకి ఏపీ కోటాలో అవకాశం కల్పించే అంశంపై జరుగుతున్న ప్రచారం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే.. ఈ ప్రతిపాదనకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఏమాత్రం ఆసక్తితో లేరని.. పైగా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ ఇప్పుడు కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.
వచ్చే నెల 18న ఈ ఎన్నికలు జరగనున్నట్లు ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. మరో స్థానాలకు ఉప ఎన్నికలు( మహారాష్ట్రలో సునేత్ర పవార్, తమిళనాడులో సీవే షణ్ముగం అసెంబ్లీకి ఎన్నికైన నేపథ్యంలో) జరగనున్నాయి. ఇందులో ఏపీ నుంచి నాలుగు స్థానాలు ఉన్నాయి.
అయితే అసలు చర్చ మాత్రం అభ్యర్థుల ఎంపిక చుట్టూనే తిరుగుతోంది. తమిళనాడులో బీజేపీకి ముఖచిత్రంగా మారిన అన్నామలైకి.. అక్కడ గెలిచే పరిస్థితి లేకపోవడంతో మిత్రపక్షాల సహాయంతో రాజ్యసభకు పంపాలని ఆలోచన కమలనాథుల్లో ఉందన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. అందులో భాగంగానే ఏపీ నుంచి అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ సీటును బయటివారికి ఇవ్వడంపై సానుకూలంగా లేరని సమాచారం.
అసెంబ్లీలో మెజారిటీ ఉన్నందున.. టీడీపీ, జనసేన, బీజేపీ (2+2+1) పద్ధతిలో ఆ పంపకం జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీ వర్గాలు మాత్రం మరోలా చర్చించుకుంటున్నాయి. ఈసారి రాజ్యసభ సీట్ల విషయంలో చంద్రబాబు పూర్తిగా తన రాజకీయ, సామాజిక సమీకరణాలకే ప్రాధాన్యం ఇవ్వబోతున్నారట. ముఖ్యంగా తన సామాజిక వర్గానికి చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు లేదంటే ఆర్థికంగా పార్టీకి అండగా నిలిచిన కీలక వ్యక్తికి అవకాశం కల్పించే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చాలా కాలంగా రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలకు ఈసారి కూడా నిరాశ తప్పదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవుల కోసం ఎదురుచూస్తున్న మిత్రపక్షాల నేతలు.. కనీసం రాజ్యసభలోనైనా అవకాశం వస్తుందని భావించారట. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే.. బాబు మార్క్ అనే ఫార్ములా తప్పదనే చర్చ సాగుతోంది.
మరోవైపు అన్నామలై విషయంలో టీడీపీ జాగ్రత్తగా వ్యవహరిస్తోందన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీకి దూకుడు నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ఏపీ నుంచి రాజ్యసభ అవకాశం ఇస్తే.. భవిష్యత్తులో దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశముందని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే బీజేపీ నుంచి ఒత్తిళ్ల ప్రస్తావన లేకుండా ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న తన మనుషులతో రాజకీయం నడిపిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆ ఎంపీకి మళ్లీ చాన్స్ దక్కేనా?
ఏపీ రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమల్ నత్వానీ టర్మ్ కూడా ఈ జూన్ 21తో ముగియనుంది. 2020లో వైఎస్సార్‌సీపీ మద్దతుతో ఆయన రాజ్యసభకు వెళ్లారు. అయితే ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. దీంతో నత్వానీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఆయనకు మళ్లీ అవకాశం రావడం ఫిఫ్టీ-ఫిఫ్టీ చాన్స్‌గా కనిపిస్తోంది. కూటమి మధ్య సీట్ల పంపకం చాలా కీలకంగా మారడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. కానీ, చంద్రబాబు అది జరగనివ్వడం డౌటే. అయితే.. ఢిల్లీ స్థాయిలో ఆయనకున్న పరిచయాలు, రిలయన్స్ వర్గాలతో ఉన్న అనుబంధం, వివిధ రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలను మేనేజ్ చేయగల సామర్థ్యం వంటి అంశాలు ఆయనకు ప్లస్‌గా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రంలోని పెద్దలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం వల్ల చివరి నిమిషంలో సమీకరణాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. నత్వానీ పేరు బీజేపీ కోటాలో పరిశీలనలో ఉందన్న టాక్ ఉన్నప్పటికీ.. కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వాలన్న ఆలోచన కమలనాథుల్లో కూడా ఉందని చెబుతున్నారు. దీంతో నత్వానీకి ఎక్స్‌టెన్షన్ ఉంటుందా? ఉండదా? అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.


