సెక్యూరిటీ లేకుండా వెళ్తే ప్రజలే తంతారు: కేటీఆర్‌ | BRS Leader KTR Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

సెక్యూరిటీ లేకుండా వెళ్తే ప్రజలే తంతారు: కేటీఆర్‌

Nov 6 2024 6:13 AM | Updated on Nov 6 2024 6:13 AM

BRS Leader KTR Fires On CM Revanth Reddy

సీఎం రేవంత్‌రెడ్డిపై అంతగా వ్యతిరేకత ఉంది

హామీల అమల్లో విఫలంపై జనాగ్రహం

ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు సర్కారే కారణం  

ఆటో డ్రైవర్ల జేఏసీ ధర్నాలో కేటీఆర్‌

కవాడిగూడ/రాంగోపాల్‌పేట్‌: సెక్యూరిటీ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బయటకు వెళ్తే ప్రజలు తన్నే పరిస్థితి వచ్చిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో సీఎంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. రవాణా రంగ కార్మీకులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆటో మీటర్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఆటో డ్రైవర్‌ యూనియన్‌ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని అనుకోలేదని చెప్పారు. గత పదేళ్లలో కేసీఆర్‌ హయాంలో అభివృద్ధి ఫలాలు అనుభవిస్తే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని ఆరున్నర లక్షల ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా తయారైందని అన్నారు.  

ఆటో డ్రైవర్లకు రూ.5 వేల భృతి ఏది? 
ఆటో డ్రైవర్లకు నెలకు రూ.5 వేల భృతి ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్‌ ప్రశ్నించారు. మహాలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.2,500 భృతి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిందని విమర్శించారు. 

అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్యలు చేసుకున్న ఆటో డ్రైవర్ల పేర్ల జాబితాను ప్రభుత్వానికి ఇస్తే ఇప్పటివరకు వారి కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. రాబోయే శాసనసభ సమావేశాల్లో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  

ఎన్ని కేసులు పెట్టినా వెనక్కు తగ్గం 
నిరుద్యోగులను, రైతులను, వృద్ధులను కూడా మార్పు పేరుతో కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ మిత్రపక్షం సీపీఐ అనుబంధ కార్మీక సంఘం ఏఐటీయూసీ కూడా ప్రభుత్వంపై పోరాడటం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపినా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల కోసం పోరాడుతామని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ శంభిపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, కాలేరు వెంకటేష్‌, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాగంటి గోపీనాథ్, బీఆర్‌ నేతలు బాల్కసుమన్, గణేష్‌గుప్త, దాస్యం వినయ్‌ భాస్కర్, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్, ఆటో డ్రైవర్‌ జేఏసీ నాయకులు జీ వెంకటేశం, వేముల మారయ్య, పి. శ్రీకాంత్, లింగంగౌడ్‌ తదితరులు హాజరయ్యారు. మహాధర్నాకు కేటీఆర్, బీఆర్‌ఎస్‌ నేతలు ఆటోలో రావటం గమనార్హం.  

ప్యారడైజ్‌లో లంచ్‌
ఆటో డ్రైవర్ల మహాధర్నాలో పాల్గొన్న తర్వాత కేటీఆర్‌ తన పార్టీ నేతలతో కలిసి ప్యారడైజ్‌లో హోటల్‌లో మధ్యాహ్న భోజనం చేశారు. కేటీఆర్‌ వెంటన బీఆర్‌ఎస్‌ నేతలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, మాగంటి గోపినాథ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేష్‌, శంభిపూర్‌ రాజు తదితరులు ఉన్నారు.  

కేటీఆర్‌ను పిలువనేలేదు 
ఇందిపార్కు వద్ద చేపట్టిన ఆటో డ్రైవర్ల మహాధర్నాకు కేటీఆర్‌ను ఆహ్వానించలేదు. అయినా ఆయన హాజరై ఆటో డ్రైవర్ల సమస్యలను పక్కదారి పట్టించారు.  
–ఆటో డ్రైవర్ల జేఏసీ నేత, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బి. వెంకటేశం  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement