తొలిరోజే చెత్తను ఎత్తేస్తాం.. గుర్తు పెట్టుకో ‘చీప్‌ మినిస్టర్‌’: కేటీఆర్‌ | BRS Leader KTR Fires On CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

తొలిరోజే చెత్తను ఎత్తేస్తాం.. గుర్తు పెట్టుకో ‘చీప్‌ మినిస్టర్‌’: కేటీఆర్‌

Aug 21 2024 5:10 AM | Updated on Aug 21 2024 5:10 AM

BRS Leader KTR Fires On CM Revanth Reddy

నా మాటలు గుర్తు పెట్టుకో ‘చీప్‌ మినిస్టర్‌’

సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు  కేటీఆర్‌ కౌంటర్‌

అధికారంలోకి వచ్చిన తొలిరోజే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తాం

నీ లాంటి ఢిల్లీ గులామ్‌లు ఆత్మగౌరవాన్ని అర్థం చేసుకోలేరు

ముఖ్యమంత్రి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది

సాక్షి, హైదరాబాద్‌: ‘నా మాటలు గుర్తు పెట్టుకో ‘చీప్‌ మినిస్టర్‌’.. అధికారంలోకి వచ్చిన తొలిరోజే బీఆర్‌ అంబేడ్కర్‌ సచివా లయం పరిసరాల్లో చెత్తను తొలగిస్తాం’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు అన్నారు. సచివాలయం ఎదుట రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు విషయమై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై  కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఘాటుగా స్పందించారు. 

‘నీలాంటి ఢిల్లీ గులామ్‌లు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని అర్థం చేసుకోలేరు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన సీఎం నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. ఆయన మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

చిరువ్యాపారులపై వేధింపులా?
‘నిజామాబాద్‌లో పోలీసుల వేధింపులు భరించలేక ఓ స్వీట్‌ షాపు యజమాని తన దుకాణం ముందు బ్యానర్‌ ఏర్పాటు చేశాడు. ఓ వైపు నిజామాబాద్‌లో పోలీసులు చిరు వ్యాపారులను వేధిస్తుంటే మరోవైపు వరంగల్‌లో ఓ ఏసీపీ రద్దీగా ఉండే రోడ్డుపై మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. కేట్‌ కట్‌ చేసి బాణసంచా పేల్చడంతో గాయపడిన నలుగురు అమాయక పౌరులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు..’ అని కేటీఆర్‌ తెలిపారు. 

‘మహబూబాబాద్‌లో ఓ 17 ఏళ్ల బాలిక స్థానిక గూండా వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆసుపత్రిలో మూడురోజుల పాటు కొన ఊపిరితో కొట్లాడిన ఆ బాలిక తన సోదరులకు రాఖీ కట్టి కన్నుమూసింది. ఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నా ఎలాంటి చర్యలు లేవు..’ అని కేటీఆర్‌ మండిపడ్డారు. 

సంపూర్ణ రుణమాఫీ కోసం రేపు బీఆర్‌ఎస్‌ ధర్నా
ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 22న రాష్ట్రవ్యాప్త ధర్నాకు బీఆర్‌ఎస్‌ పార్టీ పిలుపునిచ్చింది. అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గాల్లో జరిగే ధర్నాల్లో నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ‘రుణమాఫీ జరగకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. 

రూ.2 లక్షల రుణమాఫీ జరిగిందని సీఎం రేవంత్‌ చెప్తుండగా, మంత్రులు మాత్రం రుణమాఫీ పూర్తికాలేదనిం, ఇంకా కార్యక్రమం కొనసాగుతోందని చెప్తున్నారు. సీఎం, మంత్రుల భిన్న ప్రకటనలతో రైతులు ఆయోమయం, ఆవేదనకు గురవుతున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అందరికీ వర్తింపజేస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ స్పష్టమైన హామీ ఇచ్చింది.

కానీ కనీసం 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి చేకూరలేదు. దీంతో లక్షలాది మంది రైతులు రోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి దాపురించింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు రుణమాఫీ చేసేవరకు బీఆర్‌ఎస్‌ పోరాటం ఆగదు..’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు
పంజగుట్ట: మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమనేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం రాత్రి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, సీనియర్‌ నాయకుడు దాసోజు శ్రవణ్, బీఆర్‌ఎస్‌ విద్యార్ధి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్‌లు పంజగుట్ట ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. 

రేవంత్‌రెడ్డి అభ్యంతరకరమైన భాష, దూషించే పదజాలం, హింసను ప్రేరేపించేలా చేసిన వ్యాఖ్యలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలు, న్యాయనిపుణుల సలహా ప్రకారం తదుపరి చర్యలు చేపడతామని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement