
ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా రాష్ట్ర నేతలతో భేటీకి నిర్ణయం
బూత్ స్థాయి పోల్ మేనేజ్‌మెంట్‌పై దిశానిర్దేశం చేయనున్న అగ్రనేత
రాష్ట్ర స్థాయిలోనూ మేనిఫెస్టో..కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై చార్జిషీటు!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 12న రాష్ట్రానికి రానున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేయాలని ఆయన భావిస్తున్నారు. 12న హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో పోలింగ్ బూత్ కమిటీలు ఆ పైస్థాయి నాయకులు, కార్యకర్తలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన పోల్ మేనేజ్‌మెంట్ అమలు, బూత్ స్థాయిలో పార్టీకి ఓట్లు వేయించుకోవడంపై అవగాహన కల్పించనున్నారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల కంటే ముందుగానే 17 ఎంపీ సీట్లకు గాను 9 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించిన సంగతి విదితమే. మిగతా సీట్లకు అభ్యర్థుల ఖరారు కసరత్తు సాగుతుండగా, బుధవారం ఢిల్లీలో జరగాల్సిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం శుక్రవారానికి వాయిదా పడింది. ఈ సమావేశంలో మిగిలిన స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ సర్కార్, బీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడటం ద్వారా ఎన్నికల వేడిని రాజేశారు. అమిత్‌షా పర్యటన తర్వాత బీజేపీ దూకుడు మరింత పెంచే అవకాశం ఉంది.
చార్జిషీటుపై కసరత్తు షురూ
పార్టీ పరంగా ప్రకటించాల్సిన లోక్‌సభ ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై జాతీయ స్థాయిలో కసరత్తు సాగుతోంది. ఇందులో పొందుపరచాల్సిన విషయాలపై ఇప్పటికే వివిధ వర్గాల ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. అయితే పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్ర స్థాయిలోనూ విడిగా మేనిఫెస్టోను విడుదల చేయాలని జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు అధికార కాంగ్రెస్ , విపక్ష బీఆర్‌ఎస్ పార్టీలపై చార్జిషీటు విడుదల చేయాలనే అభిప్రాయంతో ముఖ్య నేతలున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా మొదలైనట్టు చెబుతున్నారు.