BJP High Command Likely To Lift Suspension On MLA Raja Singh, Details Inside - Sakshi
Sakshi News home page

Raja Singh: రాజాసింగ్ ఎపిసోడ్‌కు త్వరలోనే ఎండ్ కార్డ్?

Published Tue, Oct 25 2022 11:57 AM

BJP High Command Thinking of Lifting Suspension On Raja Singh - Sakshi

తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ ఒక ఫైర్ బ్రాండ్. ఓ వివాదం కారణంగా ఆయనపై పార్టీ వేటు వేసింది. ఆయనపై విధించిన సస్పెన్షన్‌పై బీజేపీ హైకమాండ్ పునరాలోచనలో పడిందా? రాజాసింగ్ వివరణతో పార్టీ సంతృప్తి చెందిందా? సస్పెన్షన్ను ఎత్తివేసే ఆలోచన చేస్తోందా? 

రాజాసింగ్ ఎపిసోడ్‌కు త్వరలోనే ఎండ్ కార్డ్.!
గ్రేటర్ హైదరాబాద్‌లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎపిసోడ్‌కు త్వరలోనే ఎండ్ కార్డ్ వేయాలని కమలనాథులు భావిస్తున్నారు. నార్త్ ఇండియన్ అయిన రాజాసింగ్‌ హైదరాబాద్‌లోని ఉత్తరాదివారితో పాటు.. రాష్ట్రవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ ఇష్యూలో రాజాసింగ్ చేసిన కామెంట్స్‌పై దుమారం రేగింది. ఆ తర్వాత రాజాసింగ్ విడుదల చేసిన వీడియో అగ్నికి ఆజ్యం పోసింది. ఈ వ్యవహారం మరింత ముదరకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది బీజేపీ హైకమాండ్. 

అసలుకే మోసం జరిగిందా?
రాజాసింగ్‌ సస్పెండ్ చేయడంతో కట్టర్ హిందువులు పార్టీకి దూరమవుతారనే విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో త్వరలోనే ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం  రాజాసింగ్‌పై పెట్టిన పీడీ యాక్ట్ను ఎత్తివేయాలంటూ కొన్ని రోజులుగా హిందూ సంఘాల సైతం డిమాండ్ చేస్తున్నాయి. పార్టీ కేడర్లో, హిందూ సంఘాల్లో రాజాసింగ్‌కు పెరుగుతున్న మద్దతు చూసి.. బీజేపీ నాయకత్వం అంతర్మథనంలో పడింది. 

పీడీ యాక్ట్‌పై వ్యతిరేక గళం
కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాద్‌లో నిర్వహించే కార్యక్రమంలో హిందు దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యానిస్తారని రాజాసింగ్ ముందు నుంచే చెబుతూ వచ్చారు. హైదరాబాద్‌లో ఫారుఖీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తే ఆందోళన చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. రాజాసింగ్, హిందూ సంఘాల హెచ్చరికల నేపథ్యంలో భారీ భద్రత నడుమ మునావర్ ఫారుఖీ షోను నిర్వహించారు. షో ముగిసిన తర్వాత రాజాసింగ్ వివాదాస్పద వీడియో విడుదల చేయడంపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అందుకే పీడీ యాక్ట్‌పై పార్టీ శ్రేణులు వ్యతిరేక గళం విప్పుతున్నాయి. ఇప్పటికే విజయశాంతి ఓ ప్రకటనలో రాజాసింగ్కు మద్ధతిచ్చారు.

వివరణ ఓకే అయితే సవరణే
రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని భావించి కమలనాథులు ఎమ్మెల్యే రాజాసింగ్ ను సస్పెండ్ చేశారు. షోకాజ్ నోటీస్‌కు వివరణ ఇచ్చేందుకు 10 రోజుల సమయం ఇచ్చింది బీజేపీ హైకమాండ్. కానీ రాజాసింగ్ జైల్లో ఉండటంతో రిప్లై ఇవ్వలేకపోయారు. పార్టీ నుంచి గడువు తీసుకుని రాజాసింగ్ షోకాజ్ నోటీసుకు స్పందించారు. తాను పార్టీ లైన్ ఎక్కడా దాటలేదని, హిందువులకు సేవ చేసే అవకాశాన్ని తిరిగి కల్పించాలని సంజాయిషీ నోటీస్కు సమాధానంలో కోరారు. ఈ తరుణంలో కమలం పార్టీ అగ్రనేతలు తమ నిర్ణయాన్ని పునసమీక్షించుకునే అవకాశం ఉందని గోషామహల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రాజాసింగ్‌కు సంబంధించి బోలెడు పోస్టర్లు అక్కడ వెలిశాయి.

Advertisement
Advertisement