గెలవలేదుకానీ.. బెంగాల్‌లో గణనీయంగా పుంజుకున్న బీజేపీ

BJP Expresses Confidence About Victory In West Bengal Polls - Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు. రాష్ట్రంలో పాగా వేసేందుకు సర్వ శక్తులు ఒడ్డినప్పటికీ అధికార పీఠం లభించలేదు. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలన్న కాషాయ దళం ఆశలు నెరవేరలేదు. అయితే, రాష్ట్రంలో రాజకీయంగా పెద్దగా ఉనికే లేని స్థాయి నుంచి ప్రధాన ప్రతిపక్ష స్థాయికి చేరుకోవడాన్ని బీజేపీ విజయ ప్రస్థానంగానే చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య 3 మాత్రమే. ఆ పార్టీ సాధించిన ఓట్ల శాతం 10.16 మాత్రమే. 2019 లోక్‌సభ ఎన్నికల సమయానికి అసాధారణ స్థాయిలో కాషాయ దళం పుంజుకుంది. మోదీ హవా బెంగాల్‌లోనూ ప్రభావం చూపింది. ఆ ఎన్నికల్లో మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు గానూ 18 సీట్లను బీజేపీ గెలుచుకుంది.

2016లో 3 అసెంబ్లీ సీట్లకే పరిమితమైన పార్టీ.. మూడేళ్లు తిరిగేనాటికి రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపి లోక్‌సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించగలిగింది. 40.7 శాతం ఓట్లతో 18 స్థానాల్లో గెలవగలిగింది. మోదీ హవాతో పాటు, బీజేపీ, ఆరెస్సెస్‌ల సోషల్‌ ఇంజినీరింగ్, క్షేత్రస్థాయి ప్రణాళిక, బూత్‌ స్థాయిలో కార్యకర్తల ఏర్పాటు, ఎన్నికల సంసిద్ధతలతో పాటు బీజేపీ వ్యతిరేక ఓటులో చీలిక కూడా అందుకు కారణాలుగా భావిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో, అధికారంలోకి రావడానికి అవసరమైన సీట్లను గెల్చుకోలేనప్పటికీ.. మెరుగైన ఫలితాలనే బీజేపీ సాధించింది. సుమారు 37.11% ఓట్లతో 77 సీట్లను గెల్చుకుంది. రాష్ట్రంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న లెఫ్ట్, కాంగ్రెస్‌లను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా సాధించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలిచింది.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top