
పట్నా: బీహార్‌లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు ఊపందుకున్నాయి. తాజాగా వివిధ పార్టీల ‘మహాఘట్ బంధన్’కు కొత్తచిక్కులు వచ్చిపడ్డాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), పశుపతి కుమార్ పరాస్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్‌ఎల్‌జేపీ) ప్రతిపక్ష కూటమిలో చేరే అవకాశం ఉంది. దీంతో సీట్ల షేరింగ్ ‘మహాఘట్ బంధన్’కు పెద్ద సవాల్‌గా నిలవనుంది.
బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ త్వరలో మరో రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగం కానున్నాయన్నారు. వీరి కోసం తమ సీట్ల వాటాను త్యాగం చేయాల్సి వస్తుందన్నారు. కూటమిలో ఆధిపత్య పార్టీ అయిన ఆర్జేడీ కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అప్పుడు భాగస్వాములకు కేవలం 93 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. కనీసం 40 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్న వామపక్షాల పార్టీలకు కొత్తగా చేరే పార్టీలతో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
2020 బీహార్ ఎన్నికల్లో సీపీఐ (ఎంఎల్) పోటీ చేసిన 19 సీట్లలో 12 గెలుచుకుంది. సీపీఎం పోటీ చేసిన 4 సీట్లలో 2 గెలుచుకుంది. సీపీఐ పోటీ చేసిన 6 సీట్లలో 2 గెలుచుకుంది. సీట్ల పంపకంపై భిన్నాభిప్రాయాలతో ‘మహాఘట్ బంధన్’ ను వీడి ఎన్డీఏలో చేరిన వీఐపీ ఈసారి 60 సీట్లను అభ్యర్థించినట్లు సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ 2020 ఎన్నికల కన్నా తక్కువ సీట్లలో పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2020లో కాంగ్రెస్ 70 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి 19 స్థానాల్లో మాత్రమే గెలిచింది.