బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ సంచలన వ్యాఖ్యలు

Bengal BJP Chief Dilip Ghosh Broken Limbs Death Threat At Rally - Sakshi

టీఎంసీ కార్యకర్తలకు హెచ్చరికలు జారీ చేసిన దిలీప్‌ ఘోష్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ఆదివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు తమ పద్దతి మార్చుకోకపోతే వారి చేతులు, కాళ్ళు విరిగిపోయే ప్రమాదం ఉందని.. చనిపోయే అవకాశం కూడా ఉందంటూ హెచ్చరించారు. హల్దియాలో నిర్వహించిన ర్యాలీలో ఘోష్‌ ప్రసంగిస్తూ.. "ఇబ్బందులు సృష్టిస్తున్న దీదీ సోదరులు రాబోయే ఆరు నెలల్లో వారి పద్దతిని మార్చుకోవాలి. లేదంటే వారి చేతులు, కాళ్లు, పక్కటెముకలు విరిగిపోవచ్చు.. తలలు పగలిపోవచ్చు. మీరు ఆసుపత్రికి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. అయినా కూడా మీ పద్దతిని మార్చుకోకపోతే ఏకంగా స్మశానవాటికకు వెళ్ళవలసి ఉంటుంది" అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

బెంగాల్‌లో తృణమూల్ ప్రభుత్వం రోజులు దగ్గర పడ్డాయన్నారు ఘోష్‌. రాష్ట్రంలో  అసెంబ్లీ ఎన్నికలను కేంద్ర దళాల అధ్వర్యంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. బిహార్‌లో లాలూ అధికారంలో ఉన్పప్పుడు జంగిల్ రాజ్యం ఉండేదని.. రాష్ట్రంలో హింస అనేది రోజువారీ వ్యవహారం అన్నారు. కానీ తమ పార్టీ గూండాలను తరిమికొట్టి బీజేపీ రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. ‘మేము జంగిల్ రాజ్‌ను ప్రజాస్వామ్యంగా మార్చాము. పశ్చిమ బెంగాల్‌లో కూడా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము’ అన్నారు. "రాబోయే అసెంబ్లీ ఎన్నికలు దీదీ పోలీసుల అధ్వర్యంలో కాకుండా దాదా పోలీసుల నియంత్రణలో జరుగుతాయని తెలియజేస్తున్నాను. ఖాకీ దుస్తులు ధరించిన పోలీసులు మామిడి చెట్టు క్రింద ఉన్న బూత్‌ల నుంచి వంద మీటర్ల దూరంలో, కుర్చీపై కూర్చుని, ఖైని నములుతూ ఓటింగ్‌ని చూస్తారు అంతే" అన్నారు. (చదవండి: ఇంకెన్ని సార్లు అవమానిస్తారు..)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా బెంగాల్ పర్యటన ముగిసిన రెండు రోజుల తరువాత దిలీప్ ఘోష్ వ్యాఖ్యలు వెలువడటం గమనార్హం. ఇక దిలీప్‌ ఘోష్‌ వ్యాఖ్యలని టీఎంసీ నాయకులు ఖండించారు. ఘోష్ రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇక రాష్ట్రంలోని 294 సీట్లలో 200 స్థానాలను గెలుచుకోవాలనే బీజేపీ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ప్రస్తుతం రాష్ట్రం‌లో టీఎంసీ, బీజేపీల మధ్య గట్టి పోరు జరగుతోంది. రాజకీయ హింస పెరిగింది. తమ మద్దతుదారులపై దాడులు జరిగియాంటూ ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక కార్యచరణ గురించి చర్చించేందుకు బెంగాల్‌ బీజేపీ నాయకులు సోమవారం పార్టీ చీఫ్‌ జేపీ నడ్డాను కలిసేందుకు ఢిల్లీకి రానున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top