Balka Suman: ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర

Balka Suman And Trs Leaders Condemn BJP Planning To Buy 4 Mlas - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తోందని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపించారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ వేదికగా జరిగిన ఘటనను ఖండిస్తూ అధికార పార్టీ నేతలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. 

ఓటమి భయంతోనే బీజేపీ ప్రలోభాల కుట్ర
చండూరు: టీఆర్‌ఎస్‌ను చూస్తుంటే బీజేపీకి వెన్నులో వణుకు మొదలైందని, సీఎం కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి బీజేపీ తమను టార్గెట్‌ చేసిందని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆరోపించారు. చండూరులో విలేకరు లతో మాట్లాడుతూ.. బీజేపీ నేతృత్వంలో సింహ యాజులు, రామచంద్ర భారతి, నందకుమార్‌ల ద్వారా టీఆర్‌ఎస్‌కు చెందిన గువ్వల బాలరాజు, పైలట్‌ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డిలను రూ.100 కోట్లకు పైగా నగదు, కాంట్రాక్టులు, ఇతర పదవులను ఇవ్వజూపి బీజేపీలోకి రావాలని ప్రలోభ పెట్టే యత్నం జరిగిందని తెలిపారు.

ఇదే విషయం తమ ఎమ్మెల్యేలు పోలీసులకు సమాచారం అందించారన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ మునుగోడులో భారీ మెజారీ్టతో గెలవబోతోందని.. బీజేపీ డిపాజిట్‌ కోల్పోతుందనే భయంతో కుట్రలకు తెర లేపుతోందని మండిపడ్డారు. బీజేపీ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి అడ్డదారిన.. దొడ్డి దారిన కొనే యత్నం మొదలు పెట్టిందని సుమన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో బీజేపీ నాటకాలాడితే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు.    

బీజేపీ ప్రలోభాలకు లోనుకారు.. 
అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ పరిహాసం చేస్తోంది. ధనస్వామ్యంతో కొనుగోళ్ల పర్వం సాగిస్తోంది. బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవు. బీజేపీ ప్రలోభాలకు ఎమ్మెల్యేలు లొంగరు. బీఆర్‌ఎస్‌తో ఢిల్లీ పీఠం కదులుతుందనే భయం. కేసీఆర్‌కు ఆదరణ పెరుగుతున్నందునే ఈ కుతంత్రం.  
– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు 

మోదీ, అమిత్‌ షా ఆటలు సాగవు 
బీజేపీకి ప్రజాస్వామ్య విలువలు లేవు. టీఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టేందుకు దురాలోచనతో అడ్డదారులు ఎంచుకుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయే రకం కాదు. కేసీఆర్‌ ముందు మోదీ, అమిత్‌ షా ఆటలు సాగవు. బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయి.  
– మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి

మోదీ, అమిత్‌ షా కుట్ర
దేశవ్యాప్తంగా కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ ఓర్వలేక మోదీ, అమిత్‌ షా కుట్ర జరుగుతోంది. రాజగోపాల్‌రెడ్డి తరహాలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అమ్ముడు పోరు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగే రకం కాదు.  
– మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

తెలంగాణలో కుదరదు 
మునుగోడులో విజయం సాధించలేమనే భయంతోనే నీచ రాజకీయాలను బీజేపీ మొదలు పెట్టింది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం మీ తరం కాదు. మహారాష్ట్ర రాజకీయాలు తెలంగాణలో కుదరదు.  
–శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్సీ 

బేరసారాలకు లొంగదు 
టీఆర్‌ఎస్‌ పార్టీ బేరసారాలకు లొంగదు. ఇది కే సీఆర్‌ పార్టీ ఎవరూ కొనుగోలు చేయలేరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే మా లక్ష్యం. 
– గువ్వల బాలరాజు, ప్రభుత్వ విప్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top