ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11:30 గంటలకు అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా విజయవాడలోని ఎస్ఈసీ కార్యాలయంలో ఈ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాగా మొత్తం మూడు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది.
తొలి విడతలో పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండో విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత మూడో విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు తేజ ఈ మేరకు రిజర్వేషన్ల వివరాలను వెల్లడించారు.
చదవండి: ఏపీలో జడ్పీ చైర్మన్ పదవుల రిజర్వేషన్లు విడుదల!


