తాడేపల్లి: రీజనల్ కో-ఆర్డినేటర్లతో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం ముగిసింది. మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 7.30 వరకు ఈ సమావేశం కొనసాగింది. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై సుదీర్ఘ కసరత్తు చేశారు. రీజనల్ కో-ఆర్డినేటర్లు, పార్లమెంటు పరిశీలకులతో వన్ టు వన్ చర్చలు జరిపారు వైఎస్ జగన్. సగం కార్పొరేషన్లలో అభ్యర్థుల ఖరారు దాదాపు పూర్తయింది. రేపు కూడా ముఖ్య నేతలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. మున్సిపల్ సీట్లపై కూడా ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
అభ్యర్థుల ఎంపిక, సమర్థవంతంగా ఎన్నికలను ఎదుర్కోవడంపై పార్టీకి చెందిన రీజినల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ పార్టీ అబ్జర్వర్లతో వైఎస్ జగన్ చర్చించారు. జిల్లాల వారీగా ఈ సమావేశాలు జరిగాయి. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలను ఎదుర్కోవడంపై ఆయన వారికి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు, మున్సిపాల్టీలకు రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో వీటిపై ప్రధానంగా చర్చ జరిగింది.
బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలి
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన, అరాచకాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇంకా రెండున్నరేళ్లగా రాష్ట్రంలో సాగుతున్న దుర్మార్గపాలన, వాటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని, ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రతిపాదిత అభ్యర్థులకు కుల ధ్రువీకరణ, నోడ్యూ సర్టిఫికెట్ విషయంలో అధికారులతో అక్రమాలు చేయిస్తున్నారన్నారు.
విశాఖపట్నంలో శశికళ అనే తాజా మాజీ కార్పొరేటర్ ఎస్సీ కులస్తురాలు అయితే, ఆమెకు ఓసీ కాపుగా సర్టిఫికెట్ ఇవ్వడం దీనికి నిదర్శనమన్నారు. దీనిపై పోరాడి పరిష్కారం దక్కించుకునేలోగా ఎన్నికల సమయం ముగుస్తుందని, చంద్రబాబు ఇలాంటి తప్పుడు విధానాలను అనుసరిస్తున్నాడని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. అన్ని అంశాలపై రీజినల్ కో-ఆర్డినేటర్లు ఎప్పటికప్పుడు స్పందించాలని కోరారు. అసెంబ్లీ అబ్జర్వర్లు, పార్లమెంటు అబ్జర్వర్లు స్థానికంగా అందుబాటులో ఉండాలని నిర్దేశించారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేస్తున్న అక్రమాలు, అరాచకాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉండాలని, వాటన్నింటినీ ప్రజల దృష్టికి తీసుకు రావాలని, లీగల్ టీంను అప్రమత్తం చేసి కోర్టుల ద్వారా వెంటనే న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా విషయాన్ని వెంటనే ఎన్నికల కమిషన్‌తో పాటు, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఈ ప్రక్రియను మొత్తం రికార్డు చేయాలని నిర్దేశించారు.
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను బైండోవర్ల పేరిట పోలీసులు వేధింపులకు దిగుతున్న ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని, వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, చట్టాన్ని ధిక్కరిస్తూ వ్యవహరించే వారిపై న్యాయపోరాటం తప్పదనే సందేశం ఇవ్వాలన్నారు. పార్టీ పట్ల అత్యంత విశ్వసనీయత, విధేయత ఉన్న వారికి అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇవ్వాలని వైఎస్ జగన్ చెప్పారు.
ఇదీ చదవండి: ‘ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ చేసిన మేలు కనిపించదా?’


