
సాక్షి,విజయవాడ: సీఎం చంద్రబాబు సోకుల కోసం కూటమి ప్రభుత్వం ప్రజల సొమ్మును ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేస్తుందనే విమర్శలు వెత్తుతున్నాయి. తాజాగా, చంద్రబాబు కరకట్ట ప్యాలెస్ కోసం మరో రూ.1.07కోట్లు మంజూరు చేసింది.
ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌లో కొత్త వాహనాల కొనుగోలు కోసం భారీ మొత్తంలో నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇలా జీవో జారీ చేసిందో లేదో చంద్రబాబు నివాసంగా ఉపయోగిస్తున్న కరకట్ట ప్యాలస్ మరమ్మతులు, సౌకర్యాల కోసం రూ. కోటి 21 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది కొత్తది కాదు. గత రెండు నెలల్లోనే కరకట్ట ప్యాలస్‌కు సంబంధించి రూ.95 లక్షలు, రూ.36 లక్షలు వేర్వేరుగా నిధులు విడుదల చేసింది. అది సరిపోదన్నట్లుగా మొన్నటికి మొన్న మరో రూ.50 లక్షలు విడుదల చేసింది.
ఈ నిధుల్లోరూ.20 లక్షలు: మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకు
రూ.16.50 లక్షలు: వంటశాల సదుపాయాల కోసం
రూ.19.50 లక్షలు: నివాసం చుట్టూ చెదల నివారణకు వినియోగించనుంది.
ఇంతకు ముందు కరకట్ట ప్యాలస్ సౌకర్యాల కోసం రూ.కోటి 44 లక్షలు ఖర్చు చేసిన ప్రభుత్వం.. గత వారం రూ. కోటి 21 లక్షలు విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాకుండా, ఢిల్లీలో చంద్రబాబు నివాసానికి సౌకర్యాల కోసం రూ.95 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.కొత్తగా ప్రజల సొమ్ము కరకట్టపాలు అన్న చందంగా.. మరోసారి కరకట్ట సోకుల కోసం రూ.1.07కోట్లు మంజూరు చేయడం గమనార్హం.
2014–19 మధ్య సీఎంగా
ఇలా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి తన విలాసాల కోసం భారీ మొత్తంలో ఖర్చు పెడుతుండడం విశేషం. గతంలో 2014–19 మధ్య సీఎంగా ఉండగా ఆయన విలాసాలు, హంగు, ఆర్భాటం, సొంత ఇళ్లు, క్యాంప్ ఆఫీసులకు పెట్టిన ఖర్చు వంద కోట్లకు పైనే. ఆ ఐదేళ్లలో హైదరాబాద్‌లో రెండేసి బంగ్లాలు, రెండేసి క్యాంపు ఆఫీస్‌లు, విజయవాడలో రెండేసి క్యాంపు ఆఫీస్‌ల పేరుతో మరమ్మతులకు, సెక్యూరిటీ, సీసీ కెమేరాలు, పోలీస్ బరాక్‌లకు కోట్ల రూపాయల ప్రజా ధనం ఖర్చు చేశారు. ఇప్పుడు మరోసారి తన మార్క్ దుబారాతో పరిపాలన చేస్తున్నారు.