గోదావరిఖని: సింగరేణి కార్మికుల సమస్యలే ఎజెండాగా బుధవారం గోదావరిఖనిలో సింగరేణి కార్మిక గర్జన నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. సాయంత్రం 5గంటలకు స్టేడియం చేరుకుని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతారు. ఈసందర్భంగా స్థానిక ప్రధాన చౌరస్తాతో పాటు పలు ప్రధాన కూడళ్లను గులాబీ జెండాలతో ముస్తాబుచేశారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రామగుండం, చెన్నూరు మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బాల్క సుమన్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఏర్పాట్లు చూస్తున్నారు. కార్మిక వర్గాన్ని భారీగా తరలించేందుకు గనులపై ఇప్పటికే గేట్ మీటింగ్లు నిర్వహించారు. సింగరేణిలో మెడికల్ ఇన్వాలిడేషన్ శాతం తగ్గిపోవడం, ఈసారి లాభాలు తక్కువగా రావడానికితోడు వాటా కూడా పెంచకపోవడంతోపాటు కార్మికుల సొంతింటి కల, మారుపేరు కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు తదితర అంశాలపై కార్మికుల్లో అసంతృప్తి ఉంది. వీటన్నింటినీ కేటీఆర్ బహిరంగ సభలో ప్రస్తావించే అవకాశం ఉంది. సింగరేణివ్యాప్తంగా ఉన్న 12ఏరియాల నుంచి పెద్ద ఎత్తున కార్మికులను బహిరంగ సభకు తరలించేందుకు టీబీజీకేఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.
నేడు ‘ఖని’కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్


