నత్తనడకన రీసర్వే | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన రీసర్వే

Oct 11 2026 11:49 PM | Updated on Oct 11 2026 11:49 PM

● ముందడుగు పడుతున్నా.. వేగం పెరగాల్సిన అవసరం!

● తొలి విడతగా 70 గ్రామాలు ఎంపిక.. ప్రస్తుతానికి 37 గ్రామాల్లోనే కసరత్తు

● మొత్తం 41,864 ఎకరాలకు ఇప్పటివరకు 13,087 ఎకరాల్లో పూర్తి

● భూ వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వ ఆధునిక సర్వే

రీ సర్వే వివరాలు..

సాక్షి పెద్దపల్లి: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూధార్‌ కేటాయించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ రీ సర్వే కార్యక్రమం జిల్లాలో ఆశించిన వేగంతో సాగడం లేదు. 1936 నాటి (నిజాం కాలం) సర్వే రికార్డులే ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో భూములకు ప్రధాన ఆధారంగా ఉన్నాయి. కాలక్రమేణా భూముల విభజనలు, బై నంబర్లు పెరగడం, పట్టణీకరణ విస్తరించడం, పరిపాలనా హద్దుల్లో మార్పులు రావడంతో పలు ప్రాంతాల్లో భూముల హద్దులపై స్పష్టత లేకుండాపోయింది. దీంతో భూ యాజమాన్య హక్కులు, హద్దుల విషయంలో వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే చేపడుతోంది. తొలి విడతలో జిల్లాలోని 70 గ్రామాలను ఎంపిక చేయగా.. 37 గ్రామాల్లో రీ సర్వే ప్రక్రియ ప్రారంభించింది.

37 గ్రామాలు.. 41,864 ఎకరాలు

జిల్లాలో తొలి విడతగా చేపట్టిన 37 గ్రామాల్లో మొత్తం 41,864.2 ఎకరాలు రీ సర్వే చేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 13,087.34 ఎకరాల రీ సర్వే పూర్తయింది. మొత్తం విస్తీర్ణంలో సుమారు 31.3 శాతం మాత్రమే పూర్తి కాగా, ఇంకా దాదాపు 69 శాతం ప్రక్రియ కొనసాగాల్సి ఉంది.

రోజుకు 300– 450 ఎకరాలు

జిల్లాలో ప్రస్తుతం రీ సర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సర్వేయర్స్‌, 50మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్స్‌, జీపీవోలు, ఇతర సిబ్బంది రోజూ సగటున 300– 450 ఎకరాల వరకు సర్వే చేస్తున్నారు. లైసెన్స్‌ సర్వేయర్స్‌కు గ్రామ బౌండరీలు నిర్ధారించినందుకు గ్రామం యూనిట్‌గా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రూ.5వేలు పారితోషికం అందిస్తున్నారు. అలాగే ఒక ఎకరం రీసర్వే నిర్వహించినందుకు రూ.60 చెల్లిస్తున్నారు. గ్రామాల వారీగా భూముల హద్దులను పరిశీలిస్తూ, రికార్డులతో క్షేత్రస్థాయి వివరాలను సరిపోల్చుతున్నారు. పలు గ్రామాల్లో రికార్డు పనులు పూర్తవగా, మరికొన్ని గ్రామాల్లో గ్రామ హద్దుల నిర్ధారణ, గ్రామసభ తదితర ప్రక్రియలు కొనసాగుతున్నాయి. 2 గ్రామాల్లో రీసర్వే పూర్తికాగా, 4 గ్రామాల్లో విలేజ్‌ బౌండరీకి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. 2 గ్రామాల్లో పనులు ప్రారంభ దశలో ఉండగా, 29 గ్రామాల్లో ఇతర ప్రక్రియలు కొనసాగుతున్నాయి.

ప్రతి భూ కమతానికి స్పష్టమైన హద్దులు

రీ సర్వే పూర్తయిన అనంతరం ప్రతి భూ కమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించడంతో పాటు ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూధార్‌ కేటాయించే అవకాశం ఉంటుంది. దీంతో భూమి విస్తీర్ణం, హద్దులు, యాజమాన్య వివరాలపై స్పష్టత రావడంతో భవిష్యత్‌లో భూ వివాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు. రీ సర్వే పూర్తయితే భూ రికార్డుల ఆధునీకరణతో పాటు రైతులకు భరోసా కల్పించేలా పారదర్శక భూ వ్యవస్థకు మార్గం సుగమం కానుంది.

ఎంపిక చేసిన గ్రామాలు: 70

తొలివిడతలో చేస్తున్నవి: 37

వీస్తర్ణం: 41,864.2 ఎకరాలు

పట్టా భూములు: 34,757.10 ఎకరాలు

ప్రభుత్వ భూములు: 6,297.1 ఎకరాలు

అటవీ భూములు: 809.31 ఎకరాలు

ఇప్పటివరకు సర్వే పూర్తి చేసినవి : 13,087.34 ఎకరాలు

సర్వే పూర్తయిన శాతం: 31

అధికారుల ఆదేశాలు.. రైతుల ఆశలు

రీ సర్వే ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న అధికారులు.. మిగిలిన గ్రామాల్లోనూ పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా సర్వే ప్రారంభం కాని గ్రామాలపై దృష్టి పెట్టి, సరిహద్దుల నిర్ధారణ పూర్తిచేసి, గ్రామసభల నిర్వహణకు సిద్ధం చేయాలని సూచిస్తున్నారు. రీ సర్వే పూర్తిగా ముగిస్తే భూ రికార్డుల్లోని తప్పులు సరిదిద్దబడి, భూ వివాదాలు గణనీయంగా తగ్గుతాయని, రైతులకు స్పష్టమైన హద్దులతో కూడిన పారదర్శక రికార్డులు అందుతాయని అధికారులు భావిస్తున్నారు. అయితే మిగిలిన గ్రామాల్లోనూ యంత్రాంగం మరింత వేగం పుంజుకుంటేనే ఈ బృహత్తర కార్యక్రమ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement