గోదావరిఖని: సింగరేణి ప్రభావిత ప్రాంతాల నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం సత్ఫలితాలనిస్తోంది. ఆర్జీ–1 ఏరియాలోని జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ద్వారా శిక్షణ పొందిన యువతకు ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా నిర్వహించిన ఇంటర్వ్యూల్లో మొత్తం 112 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరిలో 87 మంది మహిళలు హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీలో ఉద్యోగాలు సాధించగా, మరో 25 మంది సోలార్ టెక్నీషియన్లుగా ఎంపికయ్యారు. ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలు పొందిన మహిళల్లో తొలి విడతగా 55 మంది ఆదివారం గోదావరిఖని నుంచి హైదరాబాద్ బయలుదేరారు.
పారిశ్రామిక రంగంలో అవకాశాలు
ఫాక్స్‌కాన్ కంపెనీ ఆధ్వర్యంలో గత వారం జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి కేంద్రంలో మహిళా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 127 మంది మహిళలు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 87 మంది ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని కంపెనీ తయారీ కేంద్రంలో ఆపిల్ ఇయర్‌పాడ్స్, ఎలక్ట్రానిక్ విడిభాగాల అసెంబ్లింగ్ విభాగాల్లో వీరు విధులు నిర్వహించనున్నారు.
సోలార్ రంగంలో..
సోలార్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణ పొందిన యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ విభాగంలో 27 మంది పురుషులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, 25 మంది ఎంపికయ్యారు. వీరు పది రోజుల్లో ఎల్‌అండ్‌ఎన్ కంపెనీలో విధుల్లో చేరనున్నట్లు ఆర్జీ–1 జీఎం డి.లలిత్‌కుమార్ తెలిపారు.
శిక్షణ నుంచి ఉపాధి వరకు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క రెండేళ్ల క్రితం ప్రారంభించిన నైపుణ్యాభివృద్ధి కేంద్రం స్థానిక యువతకు ఉపాధి కల్పనలో కీలకంగా నిలుస్తోంది. రెండేళ్లలో ఈ కేంద్రం ద్వారా 500 మందికి పైగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ అందిస్తూ, యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటున్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను తీర్చిదిద్ది ఉద్యోగ అవకాశాలతో అనుసంధానించడం ఈ కేంద్రం ప్రత్యేకతగా నిలుస్తోంది.
నైపుణ్యాలే భవిష్యత్తుకు పునాది:లలిత్‌కుమార్
సింగరేణి ప్రభావిత ప్రాంతాల యువత ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సంస్థ కృషి చేస్తోందని ఆర్జీ–1 జీఎం డి.లలిత్‌కుమార్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు క్రమశిక్షణతో పనిచేస్తూ వృత్తిలో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఎస్‌ఓటూ జీఎం కె.చంద్రశేఖర్, ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎల్లయ్య, టాస్క్ మేనేజర్ డాక్టర్ కౌసల్య, ఎల్‌అండ్‌ఎన్ డైరెక్టర్ కౌశల్, ఫాక్స్‌కాన్ హెచ్‌ఆర్ ప్రతినిధి ఆర్.శ్రీనివాస్, జీవీటీసీ మేనేజర్ మాధవరెడ్డి, సీనియర్ పర్సనల్ ఆఫీసర్ శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జీవీటీసీ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం నుంచి 112 మందికి ఉద్యోగాలు


