సాక్షి పెద్దపల్లి: ప్రాణాలకు తెగించి మంటలతో పోరాడే అగ్నిమాపక సిబ్బంది ఇప్పుడు తమ ఉద్యోగ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ ‘86’ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ విభాగంలో అసంతృప్తికి కారణమైంది. పదోన్నతుల విధానంలో మార్పులు, సీనియారిటీకి ప్రాధాన్యం తగ్గడం, విధుల కేటాయింపులో స్పష్టత లేకపోవడం ఉద్యోగులను కలవరపెడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 120 మంది సిబ్బంది ఈ పరిణామాలతో ఆందోళన చెందుతున్నారు.
సీనియర్లకు అన్యాయమంటున్న సిబ్బంది
గతంలో ఫైర్ ఫైటర్ కానిస్టేబుల్ స్థాయి నుంచి లీడింగ్ ఫైర్ ఫైటర్, హెడ్ కానిస్టేబుల్ దశల మీదుగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ వరకు పదోన్నతులు లభించేవి. జీవో 86తో మార్పులు రావడంతో సీనియారిటీ, ప్రమోషన్ల అంశం వివాదాస్పదంగా మారిందని సిబ్బంది అంటున్నారు. 1993 బ్యాచ్‌కు చెందిన కొందరు ఇప్పటికీ లీడింగ్ ఫైర్ ఫైటర్లుగానే కొనసాగుతుండగా, 2011 బ్యాచ్ వారిలో కొందరు ఇప్పటికే స్టేషన్ ఫైర్ ఆఫీసర్లుగా ఎదిగారు. దశాబ్దాల అనుభవం ఉన్నవారు తమకంటే జూనియర్ల కింద పనిచేయాల్సి రావడం బాధాకరమని వారు వాపోతున్నారు. అలాగే 2024లో డ్రైవర్ ఆపరేటర్లుగా చేరినవారు తక్కువ అనుభవంతోనే లీడింగ్ ఫైర్ ఫైటర్లుగా పదోన్నతి పొందే అవకాశం ఉండడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అర్హతలు, అనుభవం, సీనియారిటీకి సరైన గుర్తింపు దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైవింగ్ బాధ్యతలపై అభ్యంతరం
అగ్నిమాపక, రక్షణ చర్యలే తమ ప్రధాన విధులని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. అయినా వాహనాలు నడపాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. హెవీ మోటార్ వెహికల్ (హెచ్‌ఎంవీ) లైసెన్స్ ఉంటేనే ఇంక్రిమెంట్ మంజూరు చేస్తామన్న నిబంధన తమకు ఇబ్బందిగా మారిందని చెబుతున్నారు. అత్యవసర సమయంలో తగిన డ్రైవింగ్ అనుభవం లేకుండా వాహనం నడపాల్సి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అలాంటప్పుడు ఉద్యోగంతో పాటు కుటుంబాల భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కార్యాలయ, కంప్యూటర్ పనులు కూడా అప్పగిస్తుండటంతో క్షేత్రస్థాయి విధులకు ఆటంకం కలుగుతోందని పేర్కొంటున్నారు.
అర్హతలు, అనుభవానికి గుర్తింపు ఇవ్వాలి
తమలో పీజీ, బీటెక్ వంటి ఉన్నత విద్యార్హతలు కలిగినవారు ఉన్నారని సిబ్బంది చెబుతున్నారు. విద్యార్హతలు, అనుభవం, పనితీరును పరిగణనలోకి తీసుకుని పదోన్నతులు, బాధ్యతల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని కోరుతున్నారు. సిబ్బంది మధ్య విభేదాలకు తావులేకుండా, బృందాన్ని బలోపేతం చేసే నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జీవో 86ను పునఃపరిశీలించాలని, పదోన్నతుల విధానంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమను డ్రైవింగ్ బాధ్యతలకే పరిమితం చేయకుండా, అగ్నిమాపక, సహాయక చర్యల్లో కీలక పాత్ర పోషించే రెస్క్యూ బృంద సభ్యులుగా గుర్తించి న్యాయం చేయాలని ఉమ్మడి జిల్లా ఫైర్ సిబ్బంది కోరుతున్నారు.
సీనియారిటీకి తిలోదకాలు.. ప్రమోషన్లపై అసంతృప్తి
అనుభవం లేని డ్రైవర్లకు లీడింగ్ ఫైర్ ఫైటర్లుగా పదోన్నతులపై అభ్యంతరాలు
విధుల కేటాయింపులో గందరగోళం.. హెచ్‌ఎంవీ లైసెన్స్ నిబంధనపై ఆందోళన
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 120 మంది సిబ్బందిలో కలవరం


