పెద్దపల్లి: ఎలినో ప్రభావంతో వర్షాలు లేక సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఎస్సారెస్పీ నీరు ఊరటనివ్వనుంది. పొట్ట దశలో ఉన్న వరి పంటలు ఎండిపోకుండా ఎస్సారెస్పీ నుంచి సాగునీటిని విడుదల చేశారు. శనివారం నిజామాబాద్ జిల్లా పోచంపాడు వద్ద నీటిని విడుదల చేయగా రేవల్లి డిస్ట్రిబ్యూటరీ నుంచి డీ–86, డీ–83 ప్రధాన కాలువల ద్వారా జిల్లాలోని పంటలకు సోమవారం వరకు నీరు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
పొట్ట దశలో కీలకం
ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశలో ఉండటంతో సాగునీరు అందించడం కీలకంగా మారింది. ఈ దశలో నీటి కొరత ఏర్పడితే దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉండటంతో పంటలను ఎలాగైనా కాపాడాలనే లక్ష్యంతో ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదలకు కృషి చేసినట్లు విప్ విజయరమణారావు తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.
విద్యుత్ కష్టాలకూ ఉపశమనం
ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరు రావడంతో విద్యుత్ మోటార్లపై ఆధారపడే రైతులకు కొంత ఉపశమనం లభించనుంది. కాలువలు, చెరువుల్లో నీటి నిల్వలు పెరగడంతో భూగర్భ జలమట్టాలు మెరుగుపడే అవకాశం ఉందని రైతులు భావిస్తున్నారు. దీంతో బోర్లపై ఆధారపడే పరిస్థితి తగ్గి, విద్యుత్ వినియోగం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నీటిని సక్రమంగా వినియోగించుకుంటే పంటలను గట్టెక్కించవచ్చనే ఆశాభావం రైతుల్లో వ్యక్తమవుతోంది.
నేడు పెద్దపల్లి నియోజకవర్గానికి చేరనున్న నీరు


