పెద్దపల్లి: బహుజన అస్తిత్వ పోరాటాలను కొనసాగిస్తూ, ఈనెల 15న జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం వద్ద నిర్వహించే బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. విద్య, వైద్య రంగాల్లో కార్పొరేట్ వ్యాపార ధోరణులు, ప్రశ్నపత్రాల లీకేజీలపై యువత పోరాటాలు ఉధృతం కావాల్సిన అవసరం ఉందన్నారు. బహుజన బతుకమ్మ కార్యక్రమానికి బహుజన బతుకమ్మ నిర్మాణ కమిటీ చైర్మన్ విమలక్క, అరుణోదయ సంస్థ బృందం ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. బహుజనులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏఐఎఫ్ టీయూ జిల్లా నాయకుడు బుద్ధుల రమేశ్, విరసం ఉమ్మడి కరీంనగర్ కన్వీనర్ బాలసాని రాజయ్య, అరుణోదయ రాష్ట్ర నాయకులు సీహెచ్ యాకూబ్, తిర్రి బాలకృష్ణ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి గాండ్ల మల్లేశం, జిల్లా అధ్యక్షుడు గుమ్మడి కొమురయ్య, నాయకులు కె.రాజు, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు నర్ల గోపాల్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
పెద్దపల్లిరూరల్: వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్ అన్నారు. రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వివరించారు. 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యంపెంపు, 7 అదనపు పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, 127 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, 147 అదనపు డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పనులు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. జిల్లాలో ఐదు 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
బోనస్ పరిమితి పెంచాలి
రామగుండం: పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైల్వే ఉద్యోగుల బోనస్ పరిమితి పెంచాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ కోరారు. ఆదివారం డివిజనల్ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. రైల్వే ఉద్యోగుల కనీస వేతనం రూ.28,440 ఉన్నందున బోనస్‌ను ఇదే మొత్తానికి సమానంగా చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు. ఏటా రైల్వే ఉద్యోగులకు మంజూరు చేస్తున్న ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (పీఎల్‌బీ) 2010–11 నుంచి నేటి వరకు కేవలం 78 రోజుల వేతనానికే పరిమితం కాగా, లెక్కింపు గరిష్ట పరిమితి (సీలింగ్) కూడా ఏళ్లుగా 7 వేల వరకే నిలిచిపోయిందన్నారు. రైల్వేలో ఉద్యోగుల సంఖ్య లక్ష వరకు తగ్గినా, ఉద్యోగుల కష్టంతో ఉత్పాదకత మాత్రం గణనీయంగా పెరిగిన విషయాన్ని గుర్తించాలన్నారు. రైల్వే మంత్రిత్వశాఖ తక్షణమే స్పందించి బోనస్ లెక్కింపు సీలింగ్‌ను రూ.28,440 సవరించాలని డిమాండ్ చేశారు.


