
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
పెద్దపల్లి: జిల్లాలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే నెల 14 వరకు నిర్వహిస్తారు. టీకా వేసిన పశువు చెవికి క్యూఆర్ కోడ్ పోగులు వేసి భారత్ పశుదాన్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు. గురువారం 5,127 పశువులకు టీకాలు వేసినట్లు జిల్లా పశువైద్యాధికారి విజయ్‌భాస్కర్ తెలిపారు. జిల్లాలోని పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల పరిధిలో మొత్తం మేకలు, గొర్లు, గేదెలు, ఆవులు, ఎద్దులు 5,35,557 ఉన్నట్లు పేర్కొన్నారు. గాలికుంటు సోకిన పశువుల నోటి నుంచి చొంగకారడం, కాలి డెక్కలో పగుళ్లు ఏర్పడి నడవకపోవడం, పాల ఉత్పత్తి తగ్గడం తదితర లక్షణాలు కల్పిస్తాయి. దూడలకు రెండునెలల వయసులోనే మొదటి టీకా వేయాలి. నెల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వాలి. తర్వాత ఏటా ఒకసారి టీకా తప్పనిసరిగా వేయిస్తే వ్యాధి నివారించవచ్చు.
టీకా వేయించాలి
పాడి రైతులు తప్పనిసరిగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయించాలి. పశువులకు జబ్బువచ్చిన వెంటనే గ్రహించాల్సిన అవసరం రైతులకు ఉంది. టీకా వేయిస్తే జబ్బు రాకుండా ఉంటుంది. పశుసంపద పెరుగుతుంది. – విజయభాస్కర్,
జిల్లా పశువైద్యాధికారి