
మెరుగైన సౌకర్యాలు కల్పించాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
ముత్తారం(మంథని): విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గురువారం మండలంలోని ధర్యపూర్ మోడల్ స్కూల్, కళాశాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. విద్యాప్రమాణాల గూర్చి తెలుసుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న డైనింగ్ హాల్, పెయింటింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే ముత్తారం రైతు వేదికలో ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించారు. చినజీయర్ స్వామి సంస్థ ప్రతినిధి వికాస్ తరంగణి ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ పేర్కొన్నారు. శిబిరంలో సుమారు 200మందికి పైగా మహిళలకు పరీక్షలు చేశారు. డీఎంహెచ్‌వో వాణిశ్రీ, చినజీయర్ సంస్థ కోఆర్డినేటర్ మాధవి, అశోక్‌రావు, వైద్యుడు అమరేందర్‌రావు, ఽమోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సంతోష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి
మంథని: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మంథనిలో పలు అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు. పాత పాల కేంద్రంలో ఉష ఇంటర్నేషనల్ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వ సౌజన్యంతో ఏర్పాటు చేసిన మహిళ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్ శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. వయోవృద్ధులకు అనుకూలంగా ఉండేలా డే కేర్ సెంటర్ ఏర్పాటు పనులను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. మంచిర్యాల– వరంగల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సంబంధించి జిల్లాలో భూ బదలాయింపు చివరి దశకు చేరుకుందని కలెక్టర్ వివరించారు. అక్కడక్కడ మిస్సింగ్ పరిహారం కోసం భూ సేకరణ బాధితులు పనులను అడ్డుకుంటున్నారని తెలుసుకున్న కలెక్టర్ పెండింగ్ మిస్సింగ్ స్ట్రక్చర్ పరిహారం సమస్యను ఈ నెల 24 లోపు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నెలాఖరు వరకు మంథని, ముత్తారం, రామగిరి మండలాల పరిధిలో జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన గ్రావెల్ పని పూర్తి చేయాలన్నారు. ఆర్డీవో సురేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు ఉన్నారు.