
సింథటిక్ మ్యాట్.. గ్రీన్‌గ్రాస్ కోర్ట్
● సింగరేణి స్టేడియానికి ఆధునిక హంగులు ● సమూల మార్పులకు యాజమాన్యం కసరత్తు ● రూ.7.20కోట్లతో కార్పొరేట్‌కు ప్రతిపాదనలు
గోదావరిఖని: నగరంలోని సింగరేణి జవహర్‌లాల్ నెహ్రూ సేటడియం సింథటిక్ మ్యాట్, గ్రీన్‌గ్రాస్ ఫుట్‌బాల్ కోర్టు తదితర ఆధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం సింగరేణి యాజమాన్యం ప్రణాళిక రూపొందించింది. దీనికోసం రూ.7.20కోట్లు వెచ్చించనుంది. 400 మీటర్ల పొడవైన సింథటిక్ 8లైన్ల వాకింగ్ ట్రాక్, మధ్యలో గ్రీన్‌మ్యాట్ ఫుట్‌బాల్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత మైదానాన్ని ఖాళీచేసి గోదావరి తీరంలోని సమ్మక్క – సారలమ్మ గద్దెలు, ఇన్‌టెక్‌వెల్ మధ్య సుమారు 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో గ్రౌండ్ నిర్మించేందుకు నిర్ణయించింది.
వాకర్లకు ఎంతో అనుకూలం..
స్టేడియంలో నిర్మించే 8లేన్ల సింథటిక్ ట్రాక్ వాకర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. మధ్యలో గ్రీన్‌గ్రాస్ ఫుట్‌బాల్ కోర్టు ఏర్పాటు చేయనున్నారు. సింగరేణి ఉన్నతాధికారులతోపాటు ట్రాక్ నిర్మాణం కోసం ప్రత్యేక నిపుణులను ఇక్కడకు రప్పించి ప్లాన్ తీసుకున్నారు. ప్రతిపాదనలు సింగరేణి కార్పొరేట్ కార్యాలయానికి పంపించారు. త్వరలో గ్రీన్‌సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
గోదావరి తీరంలో ప్రత్యేక గ్రౌండ్
నగర శివారులోని గోదావరి తీర సమ్మక్క– సారలమ్మ గద్దెలు, ఇన్‌టెక్‌వెల్ మధ్య సుమారు 20ఎకరాల్లో ప్రత్యేకంగా మైదానం నిర్మించాలని సింగరేణి సూత్రప్రాయంగా నిర్ణయించింది. సంస్థకు చెందిన భారీ యంత్రాలతో ఆ ప్రాంతంలోని తుమ్మపొదలను తొలగించి నేల చదను చేయడం కూడా ఇప్పటికే ప్రారంభించారు.
స్టేడియంలో స్టేజీ తొలగింపు..
జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో మార్పులకు సింగరేణి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. దీంతో ప్రస్తుతం ఉన్నస్టేజీని తొలగించింది. కార్పొరేట్ కార్యాలయం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే అభివృద్ధి పనులు ప్రారంభిస్తారని అంటున్నారు. ప్రస్తుత మైదానాన్ని అభివృద్ధి చేస్తూనే భవిష్యత్‌లో క్రీడాకారులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నారు.