
ప్రసూతి, ఆర్థో సేవల్లో మనమే టాప్
● ఎమ్మెల్యే విజయరమణారావు
పెద్దపల్లిరూరల్: ప్రసూతి సేవలను అందించడంలో జిల్లా మాతాశిశు ఆసుపత్రి, ఆర్థో సేవల్లో ప్రభుత్వాసుపత్రి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచాయని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. గురువారం పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిలో సూపరింటెండెంట్ శ్రీధర్‌తో కలిసి మాట్లాడారు. అంతకు ముందు ప్రసూతివార్డును సందర్శించారు. ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవలను అడిగి తెలుసుకున్నారు. ఒక్క సెప్టెంబర్‌లోనే ప్రభుత్వాసుపత్రిలో 250 డెలివరీలతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచామన్నారు. ప్రస్తుతమున్న 50 పడకలను 100 పడకలకు పెంచామని, కొత్త భవనం నిర్మించుకుని వచ్చే ఏడాదికి అందుబాటులోకి తెస్తామన్నారు. ఆస్పత్రిలో రోజుకో రంగు బెడ్‌షీట్ వేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. కలెక్టర శ్రీహర్ష ప్రత్యేక చొరవతో వైద్యులు, సిబ్బంది సహకారంతో రోగులకు మెరుగైన సేవలందుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి, శ్రీరాంపూర్ మార్కెట్ చైర్మన్లు స్వరూప, తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.