
మురిసిన బతుకమ్మ
ఈనెల 21వ తేదీన ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు.. తొమ్మిదిరోజులపాటు అత్యంత వైభవంగా జరిగాయి.. తీరొక్కపూలతో పేర్చిన బతుకమ్మలతో రోజుకోరీతిన తెలంగాణ ఆడబిడ్డలు ఆటాపాటలతో సంబురాలు చేసుకున్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల చప్పట్లతో ప్రారంభమైన వేడుకలు.. ఈసారి కూడా డీజే సౌండ్స్, కోలాటాలు, జానపదాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో కొత్తరూపు సంతరించుకున్నాయి. చివరిరోజు సోమవారం సాయంత్రం జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన వేడుకలు.. అర్ధరాత్రివరకూ అంగరంగ వైభవంగా జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రం, పారిశ్రామిక ప్రాంతమైన గోదావరిఖనితోపాటు పల్లెలకు ఊపిరిలాంటి మంథని, సుల్తానాబాద్, రామగుండం తదితర ప్రాంతాల్లోని జలవనరుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా వివిధ రకాల సత్తుపిండితోపాటు పసుపు, కుంకుమలను వాయినాలుగా ఇచ్చుకున్నారు. పోయిరా బతుకమ్మ.. మళ్లీ రావమ్మా? అంటూ సాగనంపారు. పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. అధికార యంత్రాంగం అన్నిఏర్పాట్లు చేసింది.
– సాక్షి ఫొటోగ్రాఫర్,
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్