
పోలీస్ తనిఖీలు ప్రారంభం
● అక్రమ నగదు రవాణాకు అడ్డుకట్ట ● రూ.50వేలకు పైగా తరలిస్తే సీజ్ ● పలు ప్రాంతాల్లో తనిఖీలు విస్తృతం
గోదావరిఖని: స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం రాత్రి జిల్లాలోని పలు కూడళ్లలో పోలీసులు మోహరించి వాహనాలను విస్తృతంగా తనిఖీ చేశారు. బస్సులు, ఆటోలు, కార్లు, ద్విచక్రవాహనాలను ఆపి సోదాలు చేశారు. ప్రధానంగా నగదు రవాణాపై ప్రత్యేక దృష్టి సారించారు. పోలీస్‌స్టేషన్ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దు ప్రాంతమైన గోదావరి వంతెనపై ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. దీంతోపాటు వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలపై నిఘా పెట్టారు. గోదావరిఖని ఏసీపీ రమేశ్ నేతృత్వంలో గోదావరిఖని వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్‌ఐలు రమేశ్ తదితరులు తనిఖీల్లో పాల్గొంటున్నారు. అనుమతి లేకుండా రూ.50వేల కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్తే సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించనున్నట్లు వారు వివరించారు.
మంథనిలో వాహనాల తనిఖీ..
మంథని: స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో మంథనిలోని అధికార యంత్రాంగం అవసరమైన చర్యల్లో నిమగ్నమైంది. మంగళవారం రాత్రి మంథనిలో వాహనాల తనిఖీ ము మ్మరం చేసింది. స్థానిక పాతపెట్రోల్ బంక్ చౌరస్తాతోపాటు పలు ప్రధాన రహదారుల వెంట పోలీసు లు సోదాలు చేశారు. డబ్బు, మద్యంతోపాటు ఇతరత్రా విలువైన వస్తువులు తరలిపోకుండా పోలీసు లు ముందస్తుగానే చర్యలకు ఉపక్రమించారు.
కన్నాల టోల్‌ప్లాజా వద్ద..
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కన్నాల టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో బసంత్‌నగర్ ఎస్సై స్వామితోపాటు పోలీస్‌సిబ్బంది వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణపత్రాలు లేకుండా రూ.50వేల కన్నా అధిక మొత్తంలో నగదు తరలించొద్దని ఎస్సై సూచించారు. ధ్రువీకరణపత్రాలు లేని వాహనదారులకు జరిమానా విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు.

పోలీస్ తనిఖీలు ప్రారంభం