
ఎన్నికల నియమావళిపై అవగాహన అవసరం
● సమన్వయంతో విధులు నిర్వర్తించాలి ● పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ సూచన
రామగిరి(మంథని): ఎన్నికల నియమావళిపై పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన అవసరమని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. సెంటినరీకాలనీ సీఎన్‌సీవోఏ క్లబ్‌లో మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గోదావరిఖని సబ్ డివిజన్‌లోని పోలీస్ అధికారులు, సిబ్బందికి డసీపీ కరుణాకర్ అవగాహన కల్పించారు. డీసీపీ మాట్లాడుతూ, ఎన్నికల సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల కమిషన్ నియంత్రణ, పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై అవగాహన ఉండాలని సూచించారు. ఎన్నికల నిర్వహణ పరికరాలు తీసుకెళ్లే రూట్ చెక్ చేసుకోవాలని, లిక్కర్, గుడుంబా, గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు. ఆబ్కారీశాఖ అధికారులతో సమన్వయంచేసుకుంటూ పనిచేసి, సంయుక్తంగా దాడులు చేయాలని సూచించారు. శాంతిభద్రత పరిరక్షణ లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు భరోసా కల్పించాలన్నారు. రౌడీషీటర్లు, పాతనేరస్తులను బైండోవర్ చేయాలని పేర్కొన్నారు. తనిఖీ ల సమయంలో వీడియో చిత్రీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని, గోదావరిఖని టూటౌన్ సీఐలు రాజు, ప్రసాద్‌రావు, రామగిరి, కమాన్‌పూర్, మంథని, ముత్తారం ఎస్సైలు శ్రీనివాస్, ప్రసాద్, రమేశ్, రవి కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.