
ఆశలు ఆవిరి
పెద్దపల్లిరూరల్: స్థానిక సం‘గ్రామం’ మొదలైంది. పల్లె పాలనలో పాలుపంచుకునేందుకు ఎదురుచూసిన వారి ఆశలను రిజర్వేషన్లు ఆవిరి చేశాయి. పోరులో సత్తా చాటాలని ఉవ్విళూరిన ప్రజాప్రతినిధుల ముఖ్య అనుచరగణానికి రిజర్వేషన్లు షాక్ ఇచ్చాయి. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో పోటీ చేయలేని పరిస్థితులకు కారణమేంటోనని విశ్లేషించుకుంటున్న నేతలు.. నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు తీస్తున్నారు. తామేమి చేసేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రిజర్వేషన్ల ప్రక్రియలో తమ జోక్యమేమీ లేదని, అధికారులు నిబంధనల మేరకే వ్యవహరించారని అనుచరగణాన్ని బుజ్జగించినట్లు తెలిసింది.
జాతకాలు తారుమారు
పల్లెపోరకు సై అంటూ కలలు గన్న నేతలకు రిజర్వేషన్లు కలిసి రాకపోగా.. మరికొందరికి.. ముఖ్యంగా యువనేతలకు అనూహ్యంగా రిజర్వేషన్లు కలిసివచ్చాయి. సర్పంచ్, వార్డు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కలిసివచ్చిన కొందరు పోటీకి సై అంటున్నారు. లాటరీ పద్ధతిన అధికారులు రిజర్వేషన్లు ప్రకటించగా.. ముఖ్య నేతలను నిరాశలోకి నెట్టేశాయి.
బీసీలకు ప్రాధాన్యం
స్థానిక సంస్థల ఎన్నికలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వం గెజిట్ కూడా జారీచేసింది. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళ కు దక్కనుంది. రాష్ట్రప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు పర్చాలనే ఆలోచనతో బీసీలకు ప్రాధాన్యం పెరిగింది. అందులో 50శాతం మహిళలకు కేటాయించడంతో జిల్లాలోని 13 జెడ్పీటీసీ స్థానాల్లో ఆరు మహిళలకే దక్కాయి. బీసీలకు 06, జనరల్‌కు 04, ఎస్సీలకు 03 స్థానాలు కేటాయించారు.
ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఇవే..
మండలం జెడ్పీటీసీ ఎంపీపీ
పెద్దపల్లి బీసీ(మహిళ) జనరల్
అంతర్గాం బీసీ మహిళ బీసీ జనరల్
శ్రీరాంపూర్ బీసీ మహిళ జనరల్ మహిళ
మంథని బీసీ జనరల్ బీసీ మహిళ
రామగిరి బీసీ జనరల్ బీసీ జనరల్
సుల్తానాబాద్ బీసి జనరల్ బీసీ మహిళ
జూలపల్లి ఎస్సీ మహిళ ఎస్సీ మహిళ
ధర్మారం ఎస్సీ జనరల్ బీసీ జనరల్
పాలకుర్తి ఎస్సీ జనరల్ ఎస్సీ జనరల్
కమాన్‌పూర్ జనరల్ మహిళ జనరల్
ఓదెల జనరల్ మహిళ జనరల్
ఎలిగేడు జనరల్ ఎస్సీ జనరల్
ముత్తారం జనరల్ జనరల్ మహిళ