
వైకల్యాన్ని జయించి.. స్వయం ఉపాధి ఎంచుకుని ..
● విధిరాతను అధిగమిస్తూ ముందుకు.. ● ఊరూరా తిరుగుతూ పగ్గాల విక్రయం ● ఆదర్శంగా నిలుస్తున్న ‘ఆరుపదుల వ్యక్తి’
మంథనిరూరల్: చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాడు.. రెండుకాళ్లు చచ్చుబడిపోయినా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు.. విధిరాతను ఎదురించాడు.. ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా చేసుకున్నాడు.. అడుగు ముందుకు వేశాడు.. ఆరుపదుల వయసులోనూ ఉపాధి మార్గం ఎంచుకున్నాడు.. ఎంతోకొంత సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ఉప్పట్ల గ్రామానికి చెందిన కాసిపేట రాయమల్లు.
చిన్నతనంలోనే పోలియో బారినపడి..
రాయమల్లు చిన్నతనంలోనే పోలియో బారినపడ్డాడు. కాళ్లు చచ్చుబడిపోయినా మొక్కవోని ధైర్యం నింపుకుని స్వయం ఉపాధి ఎంచుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక కూడా ఎవరిపైనా ఆధారడకుండా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉండగా పదేళ్ల క్రితమే కూతురుకు వివాహం చేశాడు. కొడుకు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు.
పగ్గాలు, బుట్టలు తయారు చేస్తూ..
ఒకప్పుడు సింగరేణి సంస్థలో కార్డు ద్వారా ఇచ్చే బొగ్గును తీసుకువచ్చి అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు రాయమల్లు. ఆ తర్వాత చిన్నాచితక పనులు చేసేవాడు. ఇరవై ఆరేళ్లుగా ప్లాస్టిక్ సంచుల దారాలతో పగ్గాలు, బుట్టలు తయారు చేస్తూ విక్రయిస్తున్నాడు. వ్యవసాయం చేసే రైతులు తమ ఎడ్లకు అవసరమైన పగ్గాలు, బుట్టలను రాయమల్లు వద్దే కొనుగోలు చేస్తున్నారు.
జతపగ్గం ధర రూ.250తో విక్రయం..
నాలుగు రోజులు కష్టపడితే ఒకజత పగ్గం తయారు అవుతుంది. ప్లాస్టిక్ సంచులను చీరి, దారాలను వేరుచేసి పేని తయారు చేసిన జతపగ్గాలను రూ. 250కు విక్రయిస్తున్నాడు. ఇలా నెలలో పదిజతల పగ్గాలు, పది జతల బుట్టలు తయారు చేస్తేనే కూలి గిట్టుబాటు అవుతుందని రాయమల్లు తెలిపాడు.
ఐదు కిలో మీటర్ల పరిధిలో..
సుమారు ఐదు కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు రాయమల్లు తన మూడు చక్రాల సైకిల్ సాయంతో తిరుగుతూ పగ్గాలు, బుట్టలు అమ్ముతున్నాడు. ఎడ్లకు పగ్గాలు, మూతికి కట్టే బుట్టలనే ఎక్కువగా వాడుతుంటారు. రాయమల్లు తయారు చేసిన పగ్గాలు, బుట్టలు నాణ్యంగా ఉంటాయని, అందుకే కొనుగోలు చేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.
ఆర్థికసాయం అందించాలి
రెండుకాళ్లు చచ్చుబడిపోయినా కుటుంబాన్ని సాకేందుకు ఎంతో కష్టపడుతున్న. ఏ పనులకూ నన్ను ఎవరూ పిలువరు. చేసేదేమీలేక ఉపాధి కోసం పగ్గాలు, బుట్టలు తయారు చేస్తున్న. ప్రభుత్వం, అధికారులు రుణం మంజూరు చేస్తే మరింత పనితనం మెరుగుపర్చుకుంట. మూడు చక్రల సైకిల్ పనిచేయడంలేదు. ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి. – కాసిపేట రాయమల్లు, ఉప్పట్ల