
ముందడుగు పడేదెప్పుడో?
గోదావరిఖని(రామగుండం): గతేడాది సెప్టెంబర్–20న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సాధించిన వార్షిక లాభాలు ప్రకటించింది. కార్మికుల వాటాగా 33శాతం చెల్లిస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఈఆర్థిక సంవత్సరం పూర్తయి ఐదునెలల పూర్తయ్యింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా యాజమాన్యం ముందుకెళ్లింది. అయితే 69.01మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించింది. సాంకేతిక పరంగా కోలిండియా సంస్థలకు దీటుగా ముందుకు సాగుతున్న సింగరేణి యాజమాన్యం సాధ్యమైనంత త్వరగా లాభాలు ప్రకటిస్తుందని కార్మికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంస్థ సీఎండీ ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు చూస్తుండటంతో లాభాలు త్వరగానే తేల్చేస్తారని భావిస్తున్నారు. ఐదు నెలల గడిచినా దీనిపై ప్రకటన రాకపోవడంతో గుర్తింపు సంఘం, జాతీయ కార్మిక సంఘాలు, కార్మికులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
ఇతర కంపెనీలకు దీటుగా..
బొగ్గు, విద్యుత్ ఉత్పత్తితో పలు రంగాల్లో వేగంగా దూసుకవెళ్తున్న సింగరేణి భారత రత్న, మినీ రత్న కంపెనీలకు దీటుగా ముందుకు సాగుతూ వరుసలాభాలతో అగ్రగామిగా నిలుస్తోంది. సంస్థ సాధించిన ప్రగతిపై ఏటా ఆర్థిక నివేదికలు సమర్పిస్తూ వస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 2,388.50కోట్లు లాభాలు సాధించింది. అందులో కార్మికుల వాటా 33శాతం ప్రకటించారు. ఈలెక్కన గత ఆర్థిక సంవత్సరం రూ.788.20కోట్లు కార్మికుల వాటాగా నిర్ణయించారు. గతేడాదికన్నా బొగ్గు ఉత్పత్తి తగ్గినా, వార్షిక టర్నోవర్ పెరగడంతో సంస్థకు ఈసారి లాభాలు భారీగా ఉంటాయని భావిస్తున్నారు.
35శాతం చెల్లించాలని డిమాండ్
ఏటా సింగరేణి లాభాలను ప్రకటించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. దానిలో కార్మికులకు లాభాల వాటాను ముఖ్యమంత్రి ఖరారు చేసి ప్రకటిస్తారు. కాగా గతేడాది 33శాతం లాభాల వాటా ఉండగా, ఈసారి మరింత పెంచే అవకాశాలుంటాయని కార్మికులు ఆశగా ఎదురుచూస్తున్నారు. 35శాతం వాటా చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు కూడా వాటా పెంచాలని గెలిచిన సంఘాలతో పాటు జాతీయ కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
ఏడాది లాభాలు వాటా చెల్లింపు చెల్లింపు
రూ.కోట్లలో శాతం రూ.కోట్లలో తేదీ
2015–16 1,066.13 23 245.20 07–10–16
2016–17 395.38 25 98.84 29–09–17
2017–18 1,212.75 27 327.27 29–08–18
2018–19 1,766.00 28 493.00 04–10–19
2019–20 993.00 28 278.04 14–10–20
2020–21 272.20 29 79.06 11–10–21
2021–22 1,227.00 30 368.00 10–10–22
2022–23 2,222.00 32 711.00 22–10–23
2023–24 2,388.50 33 788.20 20–09–24