పాలకుర్తి(రామగుండం): ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ అన్నారు. గురువారం మండలంలోని బసంత్‌నగర్ వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కాన్‌సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరం, సంచార చేపల విక్రయ వాహనాన్ని ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల ఆరోగ్యశ్రీతో పాటు ఖర్చు ఎక్కువైతే ఎల్‌వోసీ ఇస్తున్నామని పేర్కొన్నారు. అధిక శాతం కార్మిక కుటుంబాలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వ్యాధులను గుర్తించి మెరుగైన వైద్య సేవల కోసం అవసరమైతే హైదరాబాద్‌లోని ఆస్పత్రికి పంపిస్తామని భరోసా ఇచ్చారు. వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని వివరించారు. ఎమ్మెల్యే సతీమణి మనాలి ఠాకూర్, వైద్యులు క్యాస శ్రీనివాస్, లక్ష్మీ వాణి, నాగిరెడ్డి, అనీశ్‌పబ్బా, రాజశేఖరరెడ్డి, నాగరాజు, రాజీవ్, గోపికాంత్, కన్నాల విండో చైర్మన్ బయ్యపు మనోహర్‌రెడ్డి, పరుషవేణి శ్రీనివాస్, తవ్వ సతీశ్ పాల్గొన్నారు.