
సీబీఐ ఇక బిజీబిజీ!
హైకోర్టు న్యాయవాద దంపతులు వామన్‌రావు– నాగమణి జంటహత్య కేసు విచారణకు గురువారం సీబీఐ రంగప్రవేశం చేసింది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఫోన్‌ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకు అప్పగిస్తే ఉమ్మడి జిల్లాలోనే మూడు కేసుల విచారణ కొనసాగనుంది. ఈ మూడు కేసులతో ఉమ్మడి జిల్లాకు లింక్ ఉండటంతో రాజకీయం హీటెక్కుతోంది. –సాక్షిప్రతినిధి, కరీంనగర్
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని పార్టీలకు చెందిన ముఖ్యనేతలుండగా వారి కదలికలను పసిగట్టేందకు అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫోన్‌ట్యాపింగ్ చేసినట్లు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా కేంద్రసహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ గ్రంఽథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు తమ ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆరోపణ ఎదుర్కొంటున్న డీఎస్పీ ప్రణీత్‌రావును 2024 మార్చిలో సిరిసిల్లలో అదుపులోకి తీసుకున్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి అప్పగిస్తే రాష్ట్రంలో సంచలం సృష్టించిన ఈ మూడు కేసులు ఉమ్మడి జిల్లాతో ఉన్న లింకులు బయటపడనున్నాయి.
వామన్‌రావు
ఇంటి వద్ద సీబీఐ అధికారులు
2021 ఫిబ్రవరి 17న హైకోర్టు న్యాయవాదులు వామన్‌రావు, నాగమణి దంపతులు రామగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కల్వచర్ల సమీపంలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఏడుగురిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం సీబీఐ పునర్విచారణతో వామన్‌రావు తండ్రి ఆరోపిస్తున్నట్లు బీఆర్‌ఎస్ నేత ప్రమేయంపై ఏం తేల్చస్తుందోనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల్లో జోరుగా చర్చ నడుస్తోంది.
మంథని నియోజకవర్గం పరిధిలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ వైఫల్యానికి ప్రణాళిక, డిజైన్, నాణ్యత లోపాలు, నిర్మాణం కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వం లేఖ రాసింది. పీసీ ఘోష్ కమిషన్ ఆధారంగా విచారణ చేపట్టొద్దని హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యాం సేప్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇస్తే సీబీఐ అధికారులు విచారణ చేపట్టే అవకాశాలున్నాయి.

సీబీఐ ఇక బిజీబిజీ!