● సింగరేణిలోనే ద్వితీయస్థానం ● దూకుడు పెంచిన ఆర్జీ–2 ఏరియా
గోదావరిఖని: వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో సింగరేణిలోని ఆర్జీ–2 ఏరియా దూకుడుగా ముందుకు సాగుతోంది. సంస్థలోనే అతిపెద్ద ఓసీపీ–3 ఉత్పత్తి సాధనలో అగ్రస్థానంలో ఉంది. ఓబీ వెలికితీత, బొగ్గు ఉత్పత్తి, రవాణాలో ముందుకు సాగుతోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు చివరి నాటి 129 శాతం బొగ్గు ఉత్పత్తి నమోదుచేసి సింగరేణిలోనే నంబర్‌వన్‌గా నిలిచింది. ఉత్పత్తి లక్ష్య సాధనకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. ఇదేసమయంలో ఉద్యోగులను అప్రమత్తం చేస్తోంది. రక్షణ, ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించడంతో లక్ష్య సాధన సులభమవుతోంది.
స్థితిగతులను వివరిస్తూ..
సింగరేణి సంస్థ స్థితిగతులను ఉద్యోగులకు వివరిస్తూ లక్ష్య సాధనలో కార్మోన్ముఖులను చేయడంలో అధికారులు విజయం సాధించారు. దీంతో బొగ్గు వెలికితీయడంతో సంస్థలోనే ఆర్జీ–2 ఏరియా నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రాజెక్టులోని ప్రైవేట్ ఓబీ కంపెనీల్లో మట్టి వెలికితీత లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగడం, డిపార్ట్‌మెంట్ పరంగా ఉత్ప త్తి, ఓబీ వెలికితీత పెరగడంతో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అడ్డంకి లేకుండా పోయింది. అంతేకాకుండా డిపార్ట్‌మెంటల్ ఓబీ, బొగ్గు వెలికితీత కోసం భారీ యంత్రాలను యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ఉత్పత్తికి అనుకూల మార్గాలు ఏర్పడ్డాయి. వకీల్‌పల్లి గని కూడా ఉత్పత్తిలో దూసుకుపోతోంది. ఏరియాలోని ఓసీపీ–3, వకీల్‌పల్లి గనులు పోటాపోటీగా ఉత్పత్తి చేస్తూ లక్ష్య సాధనలో పాలుపంచుకుంటున్నాయి.
ఆదినుంచీ దూకుడుగానే..
ఆర్జీ–2 ఏరియా బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధనలో ఆదినుంచీ దూకుడుగానే సాగుతోంది. గత ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నిర్దేశిత లక్ష్యానికి మించి 129 శాతం బొగ్గు ఉతత్తి చేసింది. వర్షాలు కురిసి.. తెరిపి ఇవ్వగానే ఉత్పత్తిని వేగవంతం చేస్తోంది.
నెల వారీగా..(టన్నుల్లో)
నెల లక్ష్యం సాధించింది శాతం
ఏప్రిల్ 2,28,400 4,99,986 218
మే 5,29,000 7,05,271 133
జూన్ 5,50,000 7,20,574 131
జూలై 6,80,500 7,31,703 107
ఆగస్టు 5,78,400 6,44,656 111