
ప్రభుత్వ పాఠశాలలకు రేటింగ్
● ప్రతిభ చూపిన స్కూల్‌కు రూ.లక్ష సాయం
సుల్తానాబాద్(పెద్దపల్లి): నాణ్యమైన బోధన, పరిసరాల పరిశుభ్రత, విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ.. ఇలాంటి అంశాల్లో ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వం రేటింగ్ ఇస్తోంది. సుమారు ఐదేళ్లక్రితం నిలిచిన ఈ పథకాన్ని ఇటీవల మళ్లీ పునరుద్ధరించింది. జిల్లాలో 543 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 85,785 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం నియమించిన కమిటీలు స్కూళ్లలో తనిఖీలు చేసి మార్కులు కేటాయిస్తాయి. ఐదు పాయింట్లు సాధించిన పాఠశాలలకు కేంద్రప్రభుత్వం నేరుగా పురస్కారాలు అందింస్తుంది. జిల్లాస్థాయిలో కలెక్టర్, డీఈవో, జిల్లా వైద్యాధికారి, డీఈఈ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఉపాధ్యాయులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. వచ్చే అక్టోబర్‌లో ఈ కమిటీ స్కూళ్లను తనిఖీ చేసి మార్కులు కేటాయిస్తుంది.
30 వరకు గడువు
రేటింగ్ సాధించి పురస్కారాలు అందుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇందుకోసం ఈనెల 30వ తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తులను జిల్లాస్థాయిలో కమిటీ పరిశీలించి రేటింగ్ ఇస్తుంది. జాతీయస్థాయిలో ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహకం అందుతుంది.
– మాధవి, డీఈవో