
వృద్ధురాలి మెడలోంచి పుస్తెలతాడు చోరీ
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకవ్వ అనే వృద్ధురాలి మెడలోంచి గుర్తుతెలియని దొంగలు రెండుంపావు తులాల పుస్తెలతాడును ఎత్తుకెళ్లారు. వెంకవ్వ బుధవారం మధ్యాహ్నం భోజనం చేసి ఇంటి ముందు ప్లేట్ కడుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమెను మాటల్లో దింపి మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కుని పారిపోయారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. రూరల్ ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని ఆ ప్రాంతంలోని సీసీ పుటేజీలను పరిశీలించారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు వ్యక్తులు వచ్చినట్లు సీసీపుటేజీలో రికార్డు అయింది. ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.