
ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారా హాజరు నమోదుచేయాలి
● కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లిరూరల్: ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నిషన్ సిస్టం)ద్వారానే హాజరు నమోదు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం విద్యాశాఖపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు విద్యార్థుల హాజరు 60 నుంచి 65శాతం మాత్రమే ఉంటోందన్నారు. సాంకేతిక సమస్యలుంటే సత్వరం పరిష్కరించుకోవాలన్నారు. ఈ నెల 10 వరకు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్ ద్వారానే జరగాలన్నారు. ఈ వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. సమన్వయ కర్త పీఎం షేక్, ఎంఈఓలు తదితరులున్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టరేట్‌లో గురువారం సమావేశమయ్యారు. విద్యాశాఖలో పదోన్నతుల కారణంగా ఉపాధ్యాయలు కొరత రాకుండా సమన్వయం చేసుకోవాలన్నారు. అవసరమైతే హెల్పర్‌లను నియమించుకోవాలని, అందుకు అవసరమైన ప్రతిపాదనలను ఇవ్వాలన్నారు. జెడ్పీ సీఈవో నరేందర్, సమన్వయకర్తలు పీఎం షేక్, మల్లేశ్ తదితరులున్నారు.