ఫలించిన ఎమ్మెల్యే దుద్దిళ్ల వ్యూహం | - | Sakshi
Sakshi News home page

ఫలించిన ఎమ్మెల్యే దుద్దిళ్ల వ్యూహం

Dec 5 2023 4:46 AM | Updated on Dec 5 2023 4:46 AM

● మంథనిలో మరోసారి పాగా వేసిన కాంగ్రెస్‌ ● ప్రత్యర్థి, ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకొని విజయం

మంథని: విలక్షణమైన తీర్పు ఇచ్చే ఆనవాయితీ ఉన్న మంథని ప్రజల నాడిని అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పసిగట్టారు. ఆయన రచించిన వ్యూహం ఫలించడంతో ఐదోసారి విజయం సొంతం చేసుకున్నారు. ప్రచార ంలో వెనబడినట్టుగానే ఉండి, చివరి రోజుల్లో తనదైన శైలిలో ముందుకు సాగడంతో గెలుపు సొంతమైంది. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో నెలకొన్న అసమ్మతిని గుర్తించి, ఆ పార్టీకి చెందిన అనేక మంది ప్రజా ప్రతినిధులు, నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ వద్ద పిల్లర్లు కుంగడంతోపాటు మరోచోట బుంగ పడటా న్ని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ప్రాజె క్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల మూడేళ్లుగా గోదావరి, మానే రు తీర రైతుల్లో వ్యతిరేకతను గుర్తించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని రెండుసార్లు నియోజకవర్గానికి రప్పించడం లాభించిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నియోజకవర్గంలో అది పెద్ద మండలమైన ఉమ్మడి కమాన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని భావించి, కమాన్‌పూర్‌, రామగిరి మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో బీఆర్‌ఎస్‌ నాయకుల అంచనాలు తలకిందులు చేస్తూ రామగిరి నుంచి 5,103, మంథని మండలం నుంచి 4,700 ఓట్ల మెజారిటీ సాధించారు. తూర్పు మండలాలైన మహాముత్తారం, కాటారం, మహదేవపూర్‌, మల్హర్‌లకు చెందిన బీఆర్‌ఎస్‌ శ్రేణులను కాంగ్రెస్‌లో చేర్చుకొని, పట్టు సాధించారు. కాటారం నుంచి 7 వేల పైచిలుకు, మహదేవపూర్‌, మల్హర్‌ మండలాల నుంచి 3 వేల పైచిలుకు మెజారిటీ రాబట్టుకున్నారు. ఒక్క పలిమెల మండలంలో కొద్దిపాటి తేడా తప్ప అన్ని మండలాల్లో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబుకు మెజారిటీ రావడం విశేషం. దీంతో ఆయన 31 వేల పైచిలుకు నోట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన స్థానికంగా ఉండటం లేదని ప్రత్యర్థి చేసిన ఆరోపణలను తిప్పి కొట్టారు. గతంలో నాలుగుసార్లు ఇక్కడి నుంచి గెలిచానని, తన వద్ద ప్రజలు ఏనాడూ ఆ విషయాన్ని ప్రస్తావించలేదని, ఎక్కడున్నా వారి అభివృద్ధి, సంక్షేమం కోసమే పని చేశానని ప్రచారం చేశారు. ఈ మాటలు ప్రజలను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement