మాట్లాడుతున్న ముజమ్మిల్‌ఖాన్
రామగిరి(మంథని): అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్ర క్రియ ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ముజమ్మిల్‌ఖాన్ తెలిపారు. శనివారం సెంటినరీకాలనీ జేఎన్టీయూలో ఓట్ల లెక్కింపు అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ముజమ్మిల్‌ఖాన్ తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల కు జేఎన్టీయూ బ్లాక్–2లో పెద్దపల్లి, రామగుండం, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారని తెలిపారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం హాల్‌లో 14 టేబుళ్లు, ఒక పోస్టల్ బ్యాలెట్ టేబుల్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతీ టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఒక బృందంగా ఏర్పడి విధులు నిర్వహిస్తారని అన్నారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి 3 రిజర్వ్ బృందాలు, 3 పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు బృందాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. కౌంటింగ్ సమయంలో అధికారులు, సిబ్బంది నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని అన్నారు. కౌంటింగ్ హాల్లో అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండాలని, ప్రశాంతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పకడ్బందీగా నమోదయ్యేలా చూసుకోవాలని, గందరగోళానికి గురికావొద్దన్నారు. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపును అప్రమత్తంగా చేయాలని, అనంతరం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆ స్లిప్పులను బ్లాక్ కవర్లలో భద్రపర్చి సీల్ వేయాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ప్రక్రియ మొత్తం వీడియోలో రికార్డు చేయాలని సూచించారు. కౌంటింగ్ కేంఽద్రంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లేందుకు అనుమతి లేదని, తనిఖీలు నిర్వహించేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కంట్రోల్ యూనిట్‌లో ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రతీఒక్కరు తప్పనిసరిగా గుర్తింపుకార్డు తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, రామగుండం, పెద్దపల్లి, మంథని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు అరుణశ్రీ, మధుమోహన్, వి.హనుమా నాయక్, అధికారులు పాల్గొన్నారు.
సిబ్బంది నిష్పక్షపాతంగా వ్యవహరించాలి
జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ముజమ్మిల్ ఖాన్


