● జిల్లా ప్రజారవాణా అధికారి జి.వరలక్ష్మి
విజయనగరం క్రైమ్: దసరా సందర్భంగా విజయనగరం కాంప్లెక్స్ నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి వరలక్ష్మి శుక్రవారం తెలిపారు. విశాఖపట్నం, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట రూట్‌లలో 100 సర్వీసులు నడుపుతామన్నారు. ఆదివారం అదనంగా 10 స్పెషల్స్ బస్సులు, సోమవారం 15 స్పెషల్స్ బస్సులు వేస్తామని చెప్పారు. దూర ప్రాంత సర్వీసులను కూడా పెంచామని, ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
బాలుడి తొడలో దూరిన కర్రముక్క
● మెరుగైన వైద్యం కోసం విశాఖ
కేజీహెచ్‌కు తరలింపు
పార్వతీపురం రూరల్: ఆడుకుందామని ఉత్సాహంగా చెట్టెక్కిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ కిందపడి తీవ్రంగా గాయపడిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలం పెదఖర్జ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మండంగి సుమన్ కుమారుడు వరుణ్ తేజ్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో ఆడుకునేందుకు ఇంటి ఆవరణలోని పూలచెట్టు ఎక్కాడు. అదుపుతప్పి బాలుడు కిందకు జారి పడిపోయాడు. ఈ క్రమంలో కింద ఉన్న ఓ కర్ర ముక్క బాలుడి ఎడమ కాలి తొడ భాగంలోకి బలంగా గుచ్చుకుంది. తొడ కింద నుంచి పైకిరావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాలుడికి ప్రాథమిక చికిత్స అందించారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడం, కర్రముక్క కాలిలో ప్రమాదకరంగా ఇరుక్కుపోవడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
సీఈసీని బర్తరఫ్ చేయాలి
పార్వతీపురం రూరల్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను బర్తరఫ్ చేయడంతో పాటు ప్రత్యేక ఓటర్ల పరిశీలన (‘సర్’) విధానాన్ని రద్దు చేయాలని ఇండియా కూటమి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ‘సర్’ పేరుతో దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడం దారుణమన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీఈసీని తొలగించాలని, ‘సర్’ను రద్దు చేయకపోతే ప్రజాసంఘాలతో కలిసి దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంగల దాలినాయుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు, సీపీఎం, న్యూ డెమోక్రసీ, ఇతర పక్షాల నాయకులు బత్తిన మోహనరావు, గేదెల రామకృష్ణ, అడ్డాకుల చిన్నారావు, గొర్లి వెంకటరమణ, పోలా ఈశ్వరరావు, పి.సంగం, తోట జీవ తదితరులు పాల్గొన్నారు.
స్విమ్మర్‌కు అభినందనలు
పార్వతీపురం రూరల్: జర్మనీ నుంచి స్విట్జర్లాండ్ వరకు ఉన్న బోడెన్సీ సరస్సును విజయవంతంగా ఈదిన పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన పారా స్విమ్మర్ గణేష్ బాలగను డీఈఓ బ్రహ్మాజీరావు శుక్రవారం అభినందించారు. గతనెల 12న బోడెన్సీ సరస్సులో 11.176 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 14 నిమిషాల 33 సెకన్లలో ఈదుకుంటూ స్విట్జర్లాండ్ చేరుకోవడం అభినందించదగ్గదన్నారు. గణేష్ క్రీడా స్ఫూర్తి విద్యార్థులకు ఆదర్శనీయమన్నారు. భవిష్యత్తులో గణేష్ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.


