● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
శత్రుచర్ల పరీక్షిత్ రాజు
గరుగుబిల్లి: రాజ్యాంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్‌ను అడ్డంపెట్టుకొని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య హక్కులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. గరుగుబిల్లి మండలం రావివలస గ్రామంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ మండల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరికి ఓటు వేయాలన్నది కాకుండా ఎవరు ఓటు వేయాలనే పరిస్థితికి ప్రస్తుత ప్రభుత్వాలు తీసుకొచ్చాయన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. అవినీతి రహిత పాలన అందించడం వల్లే ప్రజలు ‘శత్రుచర్ల’,‘ మరిశర్ల’ కుటుంబాలను ఎన్నో ఏళ్లుగా ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నామని, కార్యకర్తలు ప్రమాదాలకు గురైనప్పుడు వారి కుటుంబాలకు పార్టీ తరఫున రూ.5 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావు, ఎం.సత్యనారాయణ, గంట చిన్నంనాయుడు, మరడాన వెంకటనాయుడు, జి.పద్మావతి, సిహెచ్.వెంకటనాయుడు, తెర్లి ఎల్లంనాయుడు, ఎ.గౌరునాయుడు, బి.అప్పడు, ఎం.గౌరునాయుడు, కె.ఇందుమతి, జి.ముసలినాయుడు, ఎం.భాస్కరరావు, ఎస్.సూర్యనారాయణ, డి.తిరుపతిరావు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


