పార్వతీపురం రూరల్: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పోలీసు సిబ్బందితో సమావేశమై వారి వ్యక్తిగత, ఆరోగ్య, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నుంచి ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలకు సంబంధించిన విజ్ఞప్తులు వచ్చాయని, వాటి పూర్వాపరాలు పరిశీలించి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఎలక్షన్ సెల్ సిబ్బందితో..అదనపు ఎస్పీ..
మరోవైపు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు ఎలక్షన్ సెల్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. సమస్యాత్మక, సున్నితమైన గ్రామాలు, గతంలో అవాంఛనీయ ఘటనలు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, నివేదికలు, ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ కార్యకలాపాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో సంబంధిత విభాగాలతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్బీ సీఐ రమేష్, డీసీఆర్‌బీ ఎస్సైలు, ఎలక్షన్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు.


