విద్యార్థి నేతల కిడ్నాప్ దారుణం
● మోహన్‌బాబు యూనివర్సిటీ
గుర్తింపు రద్దు చేయాలి
● విద్యార్థి సంఘాల డిమాండ్
విజయనగరం గంటస్తంభం: విద్యార్థి సంఘం నాయకులను కిడ్నాప్ చేయించిన ఘటనలో సినీనటుడు మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, మోహన్‌బాబు యూనివర్సిటీ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట నిర్వహించిన నిరసనలో మోహన్‌బాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలోని మోహన్‌బాబు యూనివర్సిటీలో అక్రమంగా అధిక ఫీజులు వసూలు చేసినందుకు గతంలో రూ.26 కోట్లను తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని, రూ.16 లక్షల జరిమానా విధించినా యాజమాన్యం దోపిడీ కొనసాగిస్తోందని ఆరోపించారు. ఫీజుల దోపిడీకీ వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న విద్యార్థి నేతలను బౌన్సర్లతో కిడ్నాప్ చేయించడం సిగ్గుచేటని పేర్కొంటూ, తక్షణమే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.


