
పార్వతీపురం నియోజకవర్గంలో అభివృద్ధిపైనా విమర్శలు
ఎమ్మెల్యే వర్సెస్ జనసేన శాసన సభ్యుడు విజయ్‌చంద్ర తీరుతో విసిగిపోతున్న జనసేన కార్యకర్తలు బహిరంగంగానే విమర్శలు నియోజకవర్గంలో సమస్యలపై పోరాడతామని హెచ్చరిక
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఎన్నికల ముందు వరకు కూటమి.. ఎన్నికల తర్వాత కుంపటిలా మారింది జిల్లాలో ‘తమ్ముళ్లు’.. జనసేన కార్యకర్తల పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచి అటు టీడీపీ.. ఇటు జనసేన విడివిడిగా.. ఇంకా చెప్పాలంటే బద్ధశత్రువుల మాదిరి ఉంటున్నాయి. జనసేన నాయకులు, కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. ఏ కార్యక్రమాలకూ వారిని ఆహ్వానించడం లేదు. పాలకొండలో జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడ పరిస్థితి కాస్త భిన్నం. అక్కడా టీడీపీ వర్సెస్ జనసేన మాదిరి పరిస్థితి ఉన్నా.. ఎమ్మెల్యే కావడంతో వివాదం మరోలా నడుస్తోంది. ఇక.. పార్వతీపురం నియోజకవర్గంలో జనసేన శ్రేణుల ఆచూకీ లేకుండా చేస్తున్న పరిస్థితి. తమను ఏనాడూ ఎమ్మెల్యే కలుపుకొని వెళ్లడం లేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పార్టీ గెలుపుకోసం ఎంతో శ్రమించామని.. ఇప్పుడు కూరలో కరివేపాకు మాదిరి తమ పరిస్థితి అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ పార్వతీపురం నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదాడ మోహనరావు అయితే.. వీలు చిక్కినప్పుడల్లా ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర తీరును ఏకిపారేస్తున్నారు.
మరింతగా చిచ్చు పెట్టిన మైనింగ్..
జిల్లాలో మైనింగ్ మాఫియా బరి తెగిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే బడిదేవరకొండ, ఆత్యం మైనింగ్, వెలుగులమెట్ట తవ్వకాల అంశం వివాదంగా మారింది. దీనిపై స్థానికులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా.. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్పందించిన దాఖలాలు లేవు. ప్రధానంగా పార్వతీపురం మండలంలోని బడిదేవరకొండ మైనింగ్ తవ్వకాల విషయంలో ఆది నుంచి పెద్ద వివాదమే జరుగుతోంది. వామపక్షాలు, గిరిజన సంఘాలు పోరాటం చేస్తున్నాయి. తమ ఆరాధ్యదైవం కొలువుండే కొండను నాశనం చేయవద్దని గిరిజనులు వేడుకుంటున్నారు. అప్పట్లో జనసేన ఇన్‌చార్జి ఆదాడ మోహనరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు దీనిపై పోరాటం చేశారు. అధికారులకు వినతిపత్రాలు అందించారు. స్థానికుల, గిరిజనుల మనోభావాలను ఆ సమయంలో పట్టించుకోకుండా, నోరు మెదపని ఎమ్మెల్యే విజయ్‌చంద్ర.. ఇటీవల కొండ వద్దకు వెళ్లి హడావిడి చేశారు. టీడీపీ నాయకులకు అందాల్సిన మామ్మూళ్లలో తేడాలు రావడం వల్లే కొత్త నాటకాలకు తెర తీశారన్న విమర్శలూ వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయమై పోరాటం ఉద్ధృతం చేస్తామని జన
సేన కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. తమ పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కూడా జిల్లాలో జరుగుతున్న మైనింగ్ మాఫియాను లిఖితపూర్వకంగా వివరించామని ఆదాడ మోహనరావు తెలిపారు. రెవెన్యూ, మైనింగ్, అటవీశాఖాధికారులు.. అవినీతి అక్రమాల మత్తులో, స్థానిక రాజకీయ నాయకుల అండదండలతో ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. మైనింగ్ మాఫియాకు నాయకులే సహకరిస్తున్నారని పరోక్షంగా ఎమ్మెల్యేపై విమర్శల బాణం ఎక్కుపెట్టారు. ఎక్కడైనా తప్పు జరిగితే వెంటనే ప్రశ్నించాలని.. మైనింగ్ జరిగిన ఆరు నెలల తర్వాత హడావిడి చేయడమేమిటని ఇటీవల బడిదేవరకొండకు వెళ్లి హంగామా చేసిన ఎమ్మెల్యేను ఉద్దేశించి నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. బేరానికి ముందుకు వెళ్లే నాయకులు ఉన్నంత వరకు ఇలాగే ఉంటుందన్నారు. ఎప్పుడూ లేని విధంగా మైనింగ్ మాఫియా ఈ ప్రభుత్వ అండదండలతో ఎందుకు రెచ్చిపోతుందో చెప్పాలని ప్రశ్నించారు.
కొంతకాలంగా పార్వతీపురం నియోజవర్గంలో అభివృద్ధి జరగడం లేదని జనసేన కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గానికి వస్తున్న నిధులు ఎక్కడికి వెళ్తున్నాయంటూ బహిరంగంగానే ఆదాడ మోహనరావు వంటి నాయకులు ప్రశ్నించారు. పార్వతీపురం డంపింగ్ యార్డు సమస్య అలానే ఉండిపోయిందని.. వార్డుల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పారు. ఈ సమస్యలపై త్వరలో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తామని కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన నాయకులు ప్రకటించడం గమనార్హం. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరిస్తానని విజయ్‌చంద్ర గతంలో పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇప్పటికీ అమలు చేయలేకపోయారు. ఇప్పుడు నియోజకవర్గంలో టీడీపీ వర్సెస్ జనసేన మాదిరి పరిస్థితి ఉంది. సొంత పార్టీ సీనియర్ నేతలనే పక్కన పెట్టేసిన వారికి.. ఇంక తామెంత అంటూ నియోజకవర్గంలోని జనసేన నాయకులు, కార్యకర్తలు రగిలిపోతున్నారు.