
మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఏనుగులు
పార్వతీపురం రూరల్: మండలంలోనికి రెండు రోజుల క్రితం ప్రవేశించిన ఏనుగుల గుంపు పెదమరికి, చినమరికి, బండిదొరవలస తదితర గ్రామాలకు సంబంధించిన రైతుల పంట పొలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేస్తున్నాయి. గురువారం రాత్రి చినమరికి గ్రామానికి చెందిన డొల్లు పారినాయుడు అనే రైతుకు చెందిన రెండెకరాల మొక్కజొన్న పంటలో తిష్ఠవేసి పూర్తిగా శుక్రవారం ఉదయానికి పంటను ధ్వంసం చేశాయి. మరికొద్ది రోజుల్లో పంట చేతికి అందికొచ్చే సమయంలో సరిగ్గా గతేడాదిలాగానే ఏనుగులు ప్రవేశించి పంటలను నాశనం చేయడం పట్ల రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. అలాగే రాత్రివేళ రహదారి పక్కనే ఉన్న పంట పొలాల్లో ఏనుగుల గుంపు తిష్ఠ వేయడంతో చీకటి పడితే సమీప గ్రామాలకు వెళ్లేందుకు రాకపోకలు సాగించేందుకు ఆయా గ్రామాల ప్రజలకు దినదిన గండంగా పరిస్థితులు నెలకొన్నాయి.