
నేరగాళ్లపై ఉక్కుపాదం మోపండి
● గంజాయి వ్యాపారస్తుల ఆస్తులు అటాచ్ చేయాలి
● ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నేరాల నియంత్రణపై దృష్టిసారిస్తూ నేరగాళ్లపై ఉక్కుపాదం మోపాలని, అలాగే గంజాయి వ్యాపారంతో ఆస్తులు కూడబెట్టే వారిని గుర్తించి వారి ఆస్తులను అటాచ్ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఎస్‌వీ మాధవ్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆయన జిల్లా పోలీసు అధికారులతో తన కార్యాలయం నుంచి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన మాసాంతపు నేరసమీక్ష సమావేశంలో పలు కీలక ఆదేశాలు జారీచేశారు. తరచూ నేరాలకు పాల్పడేవారిపై హిస్టరీ షీట్లు తెరిచి, వారి కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో తప్పనిసరిగా ప్రతిరోజూ డ్రోన్ పోలీసింగ్ నిర్వహించాలని ఎస్పీ స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న హత్య, ఆస్తి, మహిళలపై నేరాల కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందించాలన్నారు. అలాగే రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మద్యం తాగి వాహనాలు నడిపేవారిపై కఠినంగా వ్యవహించాలని సూచించారు. సైబర్ నేరాలు, సోషల్ మీడియా కేసులపై ప్రత్యేక దృష్టిసారించి సాంకేతిక పరిజ్ఞానంతో కేసులను ఛేదించాలన్నారు. గంజాయి అక్రమ రవాణా. వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని పోలీసు అధికారులకు ఎస్పీ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సోషల్‌మీడియా, సైబర్ సెల్ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్ సీఐ అప్పారావు, ఎస్బీ సీఐ రమేష్‌తో పాటు మరికొంతమంది అధికారులు పాల్గొన్నారు.