
సర్టిఫైడ్ సైకో.. బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి
● మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీ వాణి
గుమ్మలక్ష్మీపురం: గౌరవ ప్రథమైన శాసన సభలో సినీహీరో చిరంజీవిని ‘వాడెవడు’ అంటూ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంభోదించిన తీరు బాధాకరమని.. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి డిమాండ్ చేశారు. లేదంటే ఫ్యాన్స్ ఊరుకోరని, చిరంజీవిని అవమానించిన వారిని ఏం చేయాలో వారికి తెలుసన్నారు. స్థానిక విలేకరులతో ఆమె శుక్రవారం మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేసేలా బాలకృష్ణ వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న శాసన సభలో ప్రజా సమస్యలపై ప్రస్తావించాల్సింది పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతుండడం దుర్మార్గమన్నారు. బాలకృష్ణ ఎప్పుడైనా తన నియోజకవర్గం ప్రజల సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. దగ్గరికొచ్చే ఫ్యాన్స్‌ను కొట్టడం, ఆడియో ఫంక్షన్లలో మహిళలను కించపర్చేలా మాట్లాడడం, ఫోన్లు విసిరేయడం వంటి సైకో లక్షణాలు బాలకృష్ణకే ఉన్నాయన్నారు. అందుకే మెంటల్ సర్టిఫికెట్ కూడా ఆయనకు గతంలో ఇచ్చారని గుర్తుచేశారు. జగన్‌మోహన్ రెడ్డి చిరంజీవిని, సినిమా ఇండస్ట్రీని అవమానించేశారంటూ చేసిన దుష్ప్రచారమంతా చిరంజీవి ఇచ్చిన లెటర్‌తో తేటతెల్లం అయిందన్నారు. ఆ లెటర్లో జగన్‌మోహన్ రెడ్డి తనను సాదరంగా ఆహ్వానించారని, తన మాట ప్రకారమే సినిమా టికెట్ల ధర పెంచుకునేందుకు అనుమతినిచ్చారంటూ చిరంజీవి స్పష్టంగా పేర్కొన్నారని తెలియజేశారన్నారు. తప్పుడు ప్రచారాలను నమ్ముతూ ఊగిపోతున్న పవన్ కల్యాణ్ సత్యాన్ని గ్రహిస్తే మంచిదన్నారు.