
మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలి
● కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి
పార్వతీపురం రూరల్: జిల్లా పరిధిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టాలని, మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో మత్తు పదార్థాల నిర్మూలన సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డితో కలిసి శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. గంజాయి, ఇతర మత్తుపదార్థాల రవాణా, విక్రయాలకు పాల్పడేవారికి కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా అటవీ ప్రాంతాలు, బస్సులు, ఇతర వాహనాలపై పటిష్ట నిఘా ఉంచాలన్నారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై గ్రామీణ ప్రాంతాల్లో, విద్యాసంస్థల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వాటి నిర్మూలనపై అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి, అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
పటిష్ట నిఘా ఏర్పాటు చేశాం..
ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి మాట్లాడుతూ మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్టులు, సీసీ కేమెరాలు, డ్రోన్ల సహాయంతో నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 17 కేసులు నమోదు చేసి 40 మందిని అరెస్టు చేశామని, వారి నుంచి 2,054 కిలోల గంజాయిని, 16 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, డీఎస్పీ ఎం.రాంబాబు, డీఎఫ్‌ఓ జీఏపీ ప్రసూన, వివిధ శాఖల జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.