
జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు కీలక మార్గదర్శకాలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు కళాశాలల నిర్వహణకు సంబంధించి కీలకమైన మార్గదర్శకాలను ఇంటర్మీడియట్ విద్య ఆర్‌జేడీ మజ్జి ఆదినారాయణ విడుదల చేశారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లాకు చెందిన 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మార్గదర్శకాలపై వివరించారు. కార్యనిర్వహణ, విద్యాప్రమాణాల బలోపేతానికి సంబంధించిన సూచనలు విధిగా పాటించాలని కోరారు. కళాశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి హాజరు తప్పనిసరిగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్‌లో, భౌతిక హాజరు పుస్తకంలో నమోదు చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రవేశాల దృష్ట్యా మొదటి సంవత్సరం విద్యార్థులను ఈ నెల 11వ తేదీ వరకు చేర్చుకోవాలని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థుల విజయశాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, ప్రతిభావంతుల కోసం పోటీ పరీక్ష శిక్షణ అందించాలన్న మార్గదర్శకాలు పాటించాలన్నారు. సమావేశంలో ఆర్‌ఐఓ ఎస్.తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.
మేడపై నుంచి జారిపడి యువకుడి మృతి
సాలూరు రూరల్: పట్టణ పరిధిలోని బొడ్డవలస గ్రామానికి చెందిన బండి మనోజ్ (25)తన ఇంటి మేడపై నుంచి జారి పడి మృతి చెందినట్లు పట్టణ సీఐ అప్పల నాయుడు తెలిపారు. ఇంటి మేడపై వడియాలు ఆరపెట్టేందుకు వెళ్లిన ఆయనకు గల శారీరక బలహీనత, అంగవైకల్యం కారణంగా ప్రమాదవశాత్తు జారిపడినట్లు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.
జర్మనీభాషలో ఉచిత శిక్షణకు ఆహ్వానం
విజయనగరం టౌన్: జర్మనీలో నర్స్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ మహిళలకు జర్మనీ భాషపై ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉపసంచాలకురాలు అన్నపూర్ణమ్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైనా నర్సింగ్, జీఎన్‌ఎమ్ పట్టభద్రులకు జర్మనీ భాషలో బి2 స్థాయిలో 8 నుంచి 10 నెలల పాటు ఉచిత శిక్షణ, వసతితో కూడిన సదుపాయాలు కలిగిన కేంద్రాలను విశాఖ, గుంటూరు, తిరుపతిలో ఏర్పాటుచేసి, వారికి జర్మనీ దేశంలో ఉపాధి అవకాశం కల్పించే ఉద్దేశంతో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రవేశానికి నైపుణ్యం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉచిత శిక్షణకు సంబంధించి మహిళలకు 35 ఏళ్ల వయసు మించకుండా బీఎస్సీ నర్సింగ్, జీఎన్‌ఎమ్ నర్సింగ్ పూర్తిచేసి క్లినికల్ అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల మహిళలు ఆగస్టు 7వ తేదీ లోపు అన్ని సర్టిఫికెట్లతో వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని దరఖాస్తు పత్రాలను కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9848871436 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
శృంగవరపుకోట: మండలంలోని కిల్తంపాలెం జవహర్ నవోదయ విద్యాలయలో 2025–26 విద్యాసంవత్సరంలో 11వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాసై, అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ వి.దుర్గాప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు www.navodaya. gov.in వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకుని పూర్తిచేసి నేరుగా నవోదయ స్కూల్ పనివేళల్లో కార్యాలయంలో ఇవ్వాలని లేదా నవోదయ విద్యాలయ మెయిల్‌లో దాఖలు చేసుకోవచ్చన్నారు.
772 లీటర్ల సారా ధ్వంసం
పార్వతీపురం రూరల్: ఇటీవల పట్టుబడిన 17 సారా కేసుల్లో స్వాధీనం చేసుకున్న 772 లీటర్ల సారాను పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏఎస్పీ అంకితా సురాన ఆధ్వర్యంలో పట్టణ శివారులో శుక్రవారం ధ్వంసం చేశారు. కార్యక్రమంలో ఎకై ్సజ్ అధికారులు సంతోష్‌కుమార్, పట్టణ సీఐ కె.మురళీధర్, ఎస్సై ఎం.గోవింద సిబ్బంది పాల్గొన్నారు.