
గుండె రోగులకు భరోసా..!
జగనన్న ముందుచూపు..
● సీహెచ్‌సీల్లో స్టెమీ కార్యక్రమానికి 2023లో శ్రీకారం ● గుండె రోగుల కోసం అందుబాటులోకి రూ.40 వేలు విలువచేసే వ్యాక్సిన్లు ● ఇప్పటి వరకు 153 మంది ప్రాణాలకు రక్షణ
విజయనగరం ఫోర్ట్:
గుండెనొప్పి (హార్ట్ ఎటాక్) వచ్చినప్పుడు సకాలంలో వైద్యం అందక... నొప్పితగ్గించే వ్యాక్సి న్లు అందుబాటులో లేక అనేక మంది మృతి చెందేవారు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, సకాలంలో వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలనే గొప్ప సంకల్పంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి స్టెమీ (జగనన్న హృదయ స్పందన) కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాజిక ఆరో గ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), ఏరియా ఆస్పత్రుల్లో స్టెమీ కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించారు. గుండె నొప్పి వచ్చే వారికి సత్వర ఉపశమనం కల్పించి ప్రాణాలు నిలిపేందుకు అవసరమైన టెనిక్టిప్లేస్ ఇంజక్షన్లు అంటుబాటులో ఉంచారు. ఈ ఇంజిక్షన్ ఇచ్చేందుకు అవసరమైన డెఫిలేటర్, 12 చానల్ ఈసీజీ మిషన్, మల్టిపారా మోనిటర్, మోబైల్ ఫోన్ (కార్డియాలజీ విభాగానికి సంప్రదించడం కోసం), ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర మందులు అందించే క్రాష్ కార్టు, ఫాలక్స్ కాట్‌లను అన్ని సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో ఏర్పాటుచేశారు. ఇప్పుడు ఈ సేవలు హార్ట్ ఎటాక్ వచ్చిన వారిని ఆదుకుంటున్నాయి.
సేవలు ఇలా...
జగన్‌మోహన్‌రెడ్డి ముందు చూపు కారణంగా జిల్లాలో అనేకమంది ప్రాణాలు నిలిచాయి. గుండెపోటు వచ్చిన వారికి సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రు ల్లో సకాలంలో వైద్య సేవలు అందించడంతో ప్రాణాలు నిలుస్తున్నాయి. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పార్వతీపురం, ఎస్.కోట, గజపతినగరం ఏరియా ఆస్పత్రులు, సాలూరు, బొబ్బిలి, బాడంగి, నెల్లిమర్ల, భోగాపురం, కురుపాం, భద్రగిరి, చినమేరంగి సీహెచ్‌సీల్లో స్టెమీ కార్యక్రమాన్ని అమలుచేశారు. కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 232 టెనిక్టిప్లేస్ ఇంజక్షన్లు సరఫరా చేయగా వీటిలో 183 వినియోగించారు. 49 ఇంజక్షన్లు ఆస్పత్రుల్లో ఇంకా ఉన్నాయి. 153 మంది బతికారు.
బొబ్బిలి పట్టణంలోని టి.ఆర్.కాలనీకి
చెందిన రామవరపు రాముకు ఇటీవల
గుండెనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే బొబ్బిలిలోని సీహెచ్‌సీకి
తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతనికి రూ.40 వేలు విలువ చేసే టెనిక్టిప్లేస్
ఇంజక్షన్ చేశారు. ఆయనకు గుండె నొప్పి తగ్గింది. ప్రాణాపాయం తప్పింది.
బలిజిపేట మండలం అరసాడకు చెందిన
బొత్స నారాయణమ్మకు ఇటీవల గుండె నొప్పితో బొబ్బిలి సీహెచ్‌సీ (సామాజిక ఆరోగ్య కేంద్రం) లో చేరారు. అక్కడి వైద్యులు స్టెమీ కార్యక్రమంలో భాగంగా టెనిక్టిప్లేస్ ఇంజ క్షన్ ఉచితంగా చేయడంతో ప్రాణాలు నిలిచాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
అందుబాటులో ఇంజక్షన్లు
సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రుల్లో స్టెమీ కార్యక్రమం అమల్లో ఉంది. రూ. 40 వేలు విలువచేసిన ఇంజక్షన్ గుండె నొప్పి వచ్చిన వారికి గోల్డెన్ అవర్ లోగా వేస్తే వారు ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత స్టంట్ లేదా ఆపరేషన్ అవసరమైన వారికి 108 అంబులెన్సులో కార్డియాలజీ రిఫరల్ ఆస్పత్రికి తరలిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద వారికి అవసరమైన చికిత్స అందిస్తారు.
– డాక్టర్ ఎన్.పి.పద్మశ్రీరాణి,
డీసీహెచ్‌ఎస్