
ఆ పాఠశాల విచిత్రం.. డబ్బులన్నీ ఒకే ఖాతాలోకి?
సీతానగరం మండలం నిడగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల పరిస్థితి మరీ దారుణం. ఇక్కడ అధిక సంఖ్యలో ఎస్సీ కుటుంబాలే. సుమారు 200 కుటుంబాలకు తల్లికి వందనం పథకం రాలేదు. అధికారుల వద్దకు వచ్చి ఆరా తీస్తే.. ఇందులో చాలా మంది ఆధార్ నంబర్‌ను పరిశీలించిన సిబ్బంది.. విస్తుపోయే విషయం చెప్పారు. పథకం ద్వారా వచ్చిన నగదు... కిల్లో స్వప్న అనే పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు చెబుతున్నారు. మొత్తం విద్యార్థుల వివరాలు అన్నీ అదే ఖాతా నంబరుతో లింకు చేశారని తెలిసింది. పొరపాటు అయితే ఒకరో, ఇద్దరో వివరాలు కలిస్తే అర్థం చేసుకోవచ్చు. ఇలా చాలా మంది వివరాలు ఒకే ఖాతాలోకి వెళ్లడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో పాఠశాలలో రేగిన విబేధాలు ఒక కారణంగా బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుని తప్పిదం వల్ల జరిగిందని భావిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి, తమకు న్యాయం చేయకపోతే, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు.