
ఇదెక్కడి అన్యాయం..
పార్వతీపురం పట్టణం వివేకానంద కాలనీకి చెందిన సబ్బవరపు శ్రీనివాసరావు, రమాదేవి దంపతులకు పాఠశాల విద్య అభ్యసిస్తున్న అచ్యుత్, దీక్షిత, గీత అనే ముగ్గురు పిల్లలు. గతంలో వీరికి అమ్మ ఒడి పథకం అందేది. ప్రస్తుతం ముగ్గురిలో ఒక్కరికీ లబ్ధి కలగలేదు. కారణం ఆరా తీస్తే.. ఆధార్ సీడింగ్‌లో వీరి నంబర్ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఇతరుల పేరుతో లింకు అయి ఉండడం గమనార్హం. ఎక్కువ మీటర్లు, అధిక వినియోగం అని సాకు చూపుతూ ఈ కుటుంబానికి తల్లికి వందనం లబ్ధిని దూరం చేశారు. ఇంకా విచిత్రం ఏమిటంటే.. కూలీ పని చేసుకుని జీవించే ఈ కుటుంబానికి సొంత ఇల్లు లేదు.. వీరి పేరిట కరెంట్ మీటరు కూడా లేదు. అద్దె ఇంట్లోనే ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. వీరి పేరిట 11 జిల్లాల్లో విద్యుత్ మీటర్లు ఉన్నట్టు నమోదుకావడంతో గగ్గోలు పెడుతున్నారు. పథకం మాట దెవుడెరుగు ముందుగా ఆ మీటర్ల సంగతి చూడండంటూ కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు వినతిపత్రం అందజేశారు.