సంతానలక్ష్మికి ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

సంతానలక్ష్మికి ప్రత్యేక పూజలు

Oct 15 2026 8:54 AM | Updated on Oct 15 2026 8:54 AM

సంతానలక్ష్మికి ప్రత్యేక పూజలు బాలిక సాధికారతతోనే సమాజాభివృద్ధి ‘ఇచ్చట దసరా మామూళ్లు ఇవ్వబడవు’

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై సంతానలక్ష్మి అమ్మవారికి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా నాలుగో రోజు సంతానలక్ష్మి అమ్మవారికి అభిషేక మహోత్సవం, కుంకుమార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి శ్రీయాగం వైభవంగా జరిగింది. సాయంత్రం 5.30 గంటలకు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, సంతానలక్ష్మి అమ్మవారికి పల్లకీసేవ, అర్చన, నివేదన, మంగళాశాసనం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ధనలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి వారి మంగళాశాసనాలతో ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గుంటూరు లీగల్‌: బాలిక సాధికారత సాధిస్తే సమాజం అభివృద్ధి చెందుతుందనే మాటను కేవలం నినాదంగా కాకుండా ఆచరణలో పెట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ బి.సాయి కల్యాణ చక్రవర్తి ఆదేశాల మేరకు బుధవారం అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో సయ్యద్‌ జియాఉద్దీన్‌ మాట్లాడుతూ బాలికలకు విద్య, ఆరోగ్యం, గౌరవం, భద్రత, సమానత్వం అనేవి ఎవరో ఇచ్చే బహుమతులు కావన్నారు. అవి వారి హక్కులని అన్నారు. బాలికలపై లైంగిక వేధింపులు, బాల్యవివాహాలు, అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, లింగ వివక్ష, సైబర్‌ వేధింపులు వంటి సమస్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. చట్టాలు ఉంటే సరిపోదని, వాటి గురించి ప్రజలకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి విజయ్‌కుమార్‌, ప్యానెల్‌ అడ్వకేట్‌ కట్టా కాళిదాసు మాట్లాడుతూ బాలికా దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. వారికి ఉన్న హక్కులు, చట్టాలపై మరింత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ సూపరింటెండెంట్‌, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌, స్టేక్‌ హోల్డర్స్‌, పోలీస్‌ శాఖ, వివిధ సంస్థల సిబ్బంది, సచివాలయం స్టాఫ్‌, ప్యానెల్‌ అడ్వకేట్స్‌, పారా లీగల్‌ వలంటీర్స్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

చీరాల ఎంపీడీవో కార్యాలయం ముందు నోటీస్‌

చీరాల టౌన్‌: దసరా వచ్చిందంటే వివిధ శాఖల్లో పనిచేసే అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేటు కార్మికులు, రోజువారీ కూలీలు దసరా మామూళ్లను అడుగుతుంటారు. ఇది చాలా కాలం నుంచి ఆచారంగా వస్తోంది. అయితే చీరాల ఎంపీడీవో కార్యాలయం ముందు మాత్రం దసరా చందాలు ఇవ్వబడవు.... ఎవ్వరూ కార్యాలయంలోకి రావద్దని ప్రత్యేకంగా నోటీస్‌ ఏర్పాటు చేశారు. ఓ వైపు స్థానిక ఎన్నికలకు కోడ్‌ కూసింది. మరో వైపు మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ప్రాదేశికాల ఎన్నికలు, గ్రామ పంచాయతీల ఎన్నికలు, వార్డు మెంబర్లు ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. వివిధ గ్రామాల ప్రజలు నిత్యం వచ్చే మండల పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ‘నోటీస్‌’ను అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement